Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఈ సారి టార్గెట్ తెలంగాణ‌

ఈ సారి టార్గెట్ తెలంగాణ‌

హైద‌రాబాద్‌లో ప్లెక్సీల గొడ‌వ మొద‌లైంది. మెట్రో పిల్ల‌ర్లు, హోర్డింగుల‌న్నీ టీఆర్ఎస్ ముందే బుక్ చేసుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌తో నింపేసింది. బీజేపీ జాతీయ స‌మావేశాలు జూలై 2, 3 తేదీల్లో ఉన్నాయి. మోదీ, అమిత్‌షాతో స‌హా సీఎంలు, కేంద్ర మంత్రులంతా సిటీలో వుంటారు. వాళ్ల స్వాగ‌తం కోసం బీజేపీ కూడా కోట్ల‌లో ఖ‌ర్చు పెడుతూ భారీగానే ప్లెక్సీలు, హోర్డింగ్‌లు పెడుతూ వుంది. బీజేపీకి స్థ‌లం ద‌క్క‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ ముందుగానే ప‌ట్టేసింది.

సౌత్ ఇండియాలో క‌ర్నాట‌క త‌ప్ప ఇంకెక్క‌డా బీజేపీ లేదు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఆంధ్రాలో సాధ్యం కాదు. ఇప్పుడు అధికారంలోకి రావ‌డానికి సుల‌భంగా క‌నిపిస్తున్న రాష్ట్రం తెలంగాణ‌. నిజానికి అంత సుల‌భ‌మేమీ కాదు. అయితే ఈ సారి బీజేపీ గ‌ట్టిగా ప‌ట్టు ప‌డుతోంది. ఒక‌ప్పుడు బెంగాల్‌లో బీజేపీ లేదు. ఈ రోజు బ‌లంగా వుంది. అదే విధంగా తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి అన్ని పాచిక‌లు క‌దుపుతోంది.

కేసీఆర్ కూడా ఈ సారి త‌న‌కి కాంగ్రెస్‌తో కాదు, బీజేపీతోనే గ‌ట్టి పోటీ అని క‌నిపెట్టారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాల‌ని యోచ‌న‌. ఆయ‌న‌తో ఎంత మంది క‌లిసొస్తారో ఇంకా తెలియ‌దు. గ‌తంలో బీజేపీతో పెద్ద‌గా విభేదాలు లేవు. ఎపుడైతే ఈట‌ల బీజేపీలో చేరి గెలిచాడో అప్ప‌టి నుంచి యుద్ధం ప్రారంభ‌మైంది.

ఈ మ‌ధ్య మోదీ హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కూడా కేసీఆర్ న‌గ‌రంలో లేరు. టీఆర్ఎస్ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ అయితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను పెద్ద‌గా గుర్తించ‌లేదు. కేటీఆర్ కూడా బీజేపీపై విమ‌ర్శ‌లు పెంచాడు.

ఈ నేప‌థ్యంలో అగ్నిప‌థ్ ఆందోళ‌న జ‌రిగింది. పోలీసు కాల్పుల్లో చ‌నిపోయిన యువ‌కుడికి టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌త్యేక నివాళుల‌ర్పించారు. బీజేపీ విధానాల‌పై దూకుడు పెంచారు. ఇపుడు బీజేపీ జాతీయ స‌మావేశాలే జ‌రుగుతున్నాయి. నేష‌న‌ల్ మీడియా అంతా హైద‌రాబాద్‌లోనే వుంటుంది. ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ఆపితే, మోదీ ప్ర‌చారం ఆగుతుందా? ఇది వాజ్‌పేయ్ నాటి బీజేపీ కాదు. మీడియా మేనేజ్‌మెంట్‌లో పండిపోయిన బీజేపీ.

టీఆర్ఎస్‌, బీజేపీ యుద్ధంలో కాంగ్రెస్ ప‌రిస్థితే త‌గ్గిపోతూ వుంది. రేవంత్‌రెడ్డి గ‌ట్టిగానే పోరాడుతున్నా జ‌నం దృష్టి కాంగ్రెస్‌పై లేదు. టీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు చీల్చి, చివ‌రికి టీఆర్ఎస్‌కే ఈ రెండు పార్టీలు మేలు చేస్తాయా? లేదంటే బీజేపీ ఎన్నిక‌ల నాటికి అనూహ్యంగా పుంజుకుంటుందో వేచి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?