cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Telangana

వేటుకు సిద్ధ‌మై... వెన‌క్కి త‌గ్గి!

వేటుకు సిద్ధ‌మై... వెన‌క్కి త‌గ్గి!

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధ‌ప‌డ్డ కాంగ్రెస్ అధిష్టానం... చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గింది. బీజేపీలో చేరేందుకు రెడీ అయిన రాజ‌గోపాల్‌రెడ్డిని నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజ‌గోపాల్‌రెడ్డితో చ‌ర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దూత‌గా ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని పంపాల‌ని నిర్ణ‌యించుకుంది.

రాజ‌గోపాల్‌రెడ్డితో శనివారం ఉత్త‌మ్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. త‌మ‌ను కాద‌ని బీజేపీలోకి వెళుతున్న రాజ‌గోపాల్‌రెడ్డిని గెంటేసేందుకు మొద‌టి కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీనియ‌ర్ల‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని పున‌రాలోచించింది. దీంతో తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌ప‌డే స‌మ‌యంలో మారాల‌నే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేలా ఒప్పించాల‌ని కాంగ్రెస్ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా బ‌ల‌మైన నేత‌లుగా గుర్తింపు పొందారు. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ ప‌గ్గాలు ఇవ్వ‌డంపై అన్న‌ద‌మ్ములిద్ద‌రూ బాహాటంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లౌక్యంగా స‌ర్దుకుపోయారు.

రాజ‌గోపాల్‌రెడ్డి మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. కాంగ్రెస్ పెద్ద‌ల‌పై వ్య‌తిరేక కామెంట్స్ చేయ‌క‌పోయినా, రాష్ట్ర నాయ‌క‌త్వంపై మాత్రం అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అసెంబ్లీలో కేసీఆర్‌పై పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి మ‌ద్ద‌తు లేద‌ని ఆ మ‌ధ్య తీవ్ర ఆసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లో బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు బీజేపీ కాచుకుని వుంది. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్‌రెడ్డిని చేర్చుకుంటే పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే రాజ‌గోపాల్‌రెడ్డి కేంద్ర మంత్రి అమిత్‌షాతో చ‌ర్చించారు. ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ నేత‌లు బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌ల‌తో చ‌ర్చించారు. నేడో రేపో ఢిల్లీ పెద్ద‌ల స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు రాజ‌గోపాల్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. ఈ ద‌శ‌లో ఆయ‌న్ను నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.  

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి