Advertisement

Advertisement


Home > Politics - Telangana

మునుగోడు ఖ‌ర్చు అక్ష‌రాలా.. రూ.627 కోట్లు!

మునుగోడు ఖ‌ర్చు అక్ష‌రాలా.. రూ.627 కోట్లు!

ఇటీవ‌లే హోరాహోరీగా సాగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో అన్ని పార్టీలూ క‌లిపి సుమారు 627 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాయ‌ని అంచ‌నా వేస్తోంది ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్! తెలంగాణ రాజ‌కీయ వేదిక‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ, తెలంగాణ రాష్ట్ర స‌మితిలు హోరాహోరీన పోటీ ప‌డ్డాయి. కాంగ్రెస్ పార్టీ కూడా త‌న వంతు ప్ర‌య‌త్నం చేసింది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా చేసిన రాజీనామాతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుకు కార‌ణం అవుతుంద‌నే అంచ‌నాలు మొద‌టి నుంచి ఉన్నాయి.

ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కారం.. క‌నీసం రెండు ల‌క్ష‌ల ఓట్లు అంటే.. ఒక్కో ఓటుకు అన్ని పార్టీలూ క‌లిపి ముప్పై వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెడ‌తాయ‌నే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ ర‌కంగా చూసుకుంటే ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. అయితే ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అంచ‌నాల ప్ర‌కారం.. మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి దాదాపు 627 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయ‌ట‌!

మ‌రి ఇందులో వివ‌రాల‌ను కూడా ఆ సంస్థ పేర్కొంది. ఓటుకు స‌గ‌టున 9 వేల రూపాయ‌లు ఇచ్చిన‌ట్టుగా ఈ సంస్థ అంచ‌నా వేసింది. దాదాపు 75 శాతం ఓట‌ర్ల‌కు ఈ సొమ్ములు అందాయ‌ని త‌మ అధ్య‌య‌న వివ‌రాల‌ను అందించింది. తొమ్మిది వేల నంబ‌ర్ అయితే బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన అంశం. టీఆర్ఎస్ త‌మ‌కు ఐదు వేల రూపాయ‌లు ఇచ్చింద‌ని, భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ‌కు నాలుగు వేల రూపాయ‌లు ఇచ్చిందంటూ యూట్యూబ్ చాన‌ళ్ల ఇంట‌ర్వ్యూల్లో చాలా మంది ఓట‌ర్లు బాహాటంగా చెప్పారు!

ఓటుకు నోటు ఇలా అధికారికం అయిపోయినంత ప‌నైంది మునుగోడులో. తీసుకున్న‌ట్టుగా చెప్పుకోవ‌డానికి జ‌నాలు సిగ్గుప‌డ‌లేదు. ఇద్ద‌రూ ఇచ్చారు, తీసుకున్నాం న‌చ్చిన వారికి ఓటేశాం అని కొందరంటే, ఎక్కువ ఇచ్చినందుకే ఓటు వేసిన‌ట్టుగా ఇంకొంద‌రు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డ‌బ్బులు ఇవ్వ‌లేదంటూ కూడా నిందించారు కొంద‌రైతే!

75 శాతం ఓట‌ర్ల‌కు క‌నీసం ఒక్కోరికి 9 వేల రూపాయ‌లు అందింద‌ని, ఇక మ‌ద్యం ఏరులై పార‌డంతో దాదాపు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ మ‌ద్యం పంప‌కాలే జ‌రిగాయని కూడా ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అంచ‌నా వేసింది.

ఇక ఇవిగాక పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించాయి. వీటికి వంద కోట్ల రూపాయ‌ల పైనే ఖ‌ర్చు అయి ఉంటుంద‌ని, ఒక్కో ర్యాలీకి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అనుకున్నా.. అన్ని పార్టీల‌వీ గ‌లిపి యాభై ర్యాలీల వ‌ర‌కూ జ‌రిగాయ‌ని, ఇలా చూస్తే 125 కోట్ల రూపాయ‌లు ఇలాంటి ప్ర‌చార ఆర్భాట ఖ‌ర్చులుంటాయ‌ని అంచ‌నా వేసింది. ఏతావాతా మునుగోడు ఖ‌ర్చు 627 కోట్ల రూపాయ‌ల‌ని ఈ సంస్థ లెక్క‌గ‌ట్టింది.

అందులో ఆశ్చ‌ర్యాలు ఏమీ లేవు. మునుగోడు ఓట‌ర్లు కెమెరాల ముందు స్పందించిన తీరును బ‌ట్టి చూసినా, అక్క‌డ పోటీ ప్ర‌తిష్టాత్మ‌కం, పార్టీల ధ‌న‌బలాల‌ను చూసినా ఈ లెక్క‌లేవీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌వు! ఈ అంచ‌నాలు దాదాపు నిజ‌మే కావొచ్చు. మ‌రి ప్ర‌యోజ‌నం ఏమిటి? ఇలాంటి ఎన్ని లెక్క‌గ‌ట్టినా.. ఉప‌యోగం అయితే ఉండ‌దు! పోలింగ్ కు ముందు ఇంత జ‌రుగుతుంటే ఈసీకి ఏమీ తెలియ‌లేదా! ఒక‌వేళ తెలిసి.. ఇలాంటి ఉప ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేసినా.. మ‌రోసారి నోటిఫికేష‌న్ ఇస్తే ప‌రిస్థితిలో మార్పు ఉంటుందా? ఇలా ర‌ద్దు చేస్తూ పోతే ఈ దేశంలో అస్స‌లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణే సాధ్యం కాదు కాబోలు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?