Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ దృష్టిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే

కేసీఆర్ దృష్టిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే

కేసీఆర్ ధోరణి ఏమిటో బీజేయేతర పార్టీలకు అర్ధం కావడంలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదంటాడు. ప్రతిపక్షాలన్నీ బీజేపీపీకి వ్యతిరేకంగా పోరాడాలంటాడు. కానీ ఆ ప్రతిపక్షాలలో కాంగ్రెస్ మాత్రం ఉండకూడదని ఆయన అభిప్రాయం. 

మోడీకి లేదా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలు అంటే వాటిల్లో కాంగ్రెస్ కూడా ఉంటుంది కదా. కానీ కేసీఆర్ కోరుకునే ప్రతిపక్షాలలో కాంగ్రెస్ ఉండకూడదు. అంతే. ఆయన ఇదివరకు ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ కూడా అదే కదా. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి ఉండాలని కదా ఆయన అంటున్నది. కానీ కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదని మిగతా ప్రతిపక్షాలు కేసీఆర్ కు మొహం మీదనే చేప్పేశాయి. 

దీంతో కేసీఆర్ ప్రతిపాదించిన ఫ్రంట్ ముందుకు కదల్లేదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా ప్రతిపక్షాలలో కాంగ్రెస్ వేరయా అంటారు కేసీఆర్. అందుకే ఆయనతో ఇతర ప్రతిపక్షాలు కలిసి రావడంలేదు. కానీ కేసీఆర్ తన ధోరణిలో మార్పు తెచ్చుకోవడంలేదు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హాను నిలబెట్టాయి. కేసీఆర్ ఆయనను ఆనందంగా స్వాగతించారు. హైదరాబాదులో ఘనంగా స్వాగతం పలికారు. టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఆయనకే ఓటేశారు.

కేసీఆర్ తో మిత్రత్వం నెరిపిన కొన్ని ప్రతిపక్షాలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు పలికాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల వంతు వచ్చింది. ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ఎంపిక చేయగా, ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేశాయి. వాస్తవానికి బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న కేసీఆర్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు తన అభిప్రాయం చెప్పలేదు. అంటే విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాదని, కేవలం కాంగ్రెస్ అభ్యర్థి అనేది కేసీఆర్ అభిప్రాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఫైట్ చేస్తూ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్ధికి మద్దతు ఇవ్వడమేమిటని కేసీఆర్ అనుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా కాంగ్రెస్ నేత మార్గరేట్ అల్వా నామినేషన్ దాఖలు చేసారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్ హాజరు కాలేదు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కానీ ఆల్వా నామినేషన్ కు ఎవరూ వెళ్ళలేదు. అసలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అనే అంశం పైన క్లారిటీ లేదు. దీని పైన పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీలు చెబుతున్నారు. కానీ, ఈ నిర్ణయం తీసుకోకపోవటం వెనుక అసలు కారణం ఏమిటంటే ... మార్గరెట్ ఆల్వా విపక్షాల కూటమి అభ్యర్థి కాదని కాంగ్రెస్ అభ్యర్థి అనే అభిప్రాయం కేసీఆర్ కు బలంగా ఉంది.

తెలంగాణలో బీజేపీ -కాంగ్రెస్ తో పోరాడుతున్న టీఆర్ఎస్.. ఢిల్లీలోనూ ఆ రెండు పార్టీలకు సమ దూరమని తేల్చి చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్వయంగా కాంగ్రెస్ నేత అభ్యర్ధిగా ఉండటంతో నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లోనూ అటు ఎన్డీఏ - ఇటు విపక్షాలు ఎంపిక చేసిన కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో..ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?