Advertisement

Advertisement


Home > Politics - Telangana

పాల్‌ని చూసి కూడా కేసీఆర్ భయపడుతున్నారా?

పాల్‌ని చూసి కూడా కేసీఆర్ భయపడుతున్నారా?

నాగుపాము కనిపిస్తే మనం జడుసుకుంటాం.. దానితో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన చెందుతాం. కొట్టాలని, చంపాలని ఆరాటపడతాం. అదే ఒక నీటిపాము కనిపిస్తే, దాని మానాన అది పోతుంది లెమ్మని వదిలేస్తాం. కానీ, నీటిపామును చూసి కూడా భయపడి కొట్టడానికి పూనుకునే వారి గురించి ఏం అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పరిస్థితి అదే తీరుగా కనిపిస్తోంది. 

తెలంగాణలో ఎప్పటికీ తెరాసనే అధికారంలో ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ అంటూనే ఉంటారు. కానీ.. వాస్తవంలో వారిలో భయం పెరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎదుటివారిని నిందించడం పెరుగుతున్న కొద్దీ.. కేసీఆర్ లో భయం పెరుగుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. తెరాస డిఫెన్సులో పడిపోతున్నదనే అభిప్రాయానికి వస్తున్నారు. 

భారతీయ జనతా పార్టీని చూసి గులాబీ దళాలు జడుసుకోవడంలో అర్థముంది. వారు అంతో ఇంతో ఆ పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఎక్కడ బీజెపీ పట్ల ఆదరణ పెరుగుతుందో అనే భయం తెరాస నాయకుల ప్రతి మాటలోనూ కనిపిస్తోంది. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు గానీ.. చివరికి కెఎ పాల్ ను తొక్కేయాలని చూస్తే ఏం అనుకోవాలి? కెఎ పాల్ ను చూసి కూడా కేసీఆర్ సర్కారు భయపడుతోందనే అనుకోవాలా?

గత ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతాననే ప్రగల్భాలతో కామెడీ చేసిన కెఎ పాల్, ఈసారి తెలంగాణ మీద కన్నేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఈసారి కింగ్ తానేనని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ కామెడీ అంతా ఓకే.. కాకపోతే.. ఆయన వడగండ్ల వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లాలని పూనుకుంటే దాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడమే చిత్రంగా కనిపిస్తోంది. 

రాజకీయంగా తమకు ప్రమాదకరంగా పరిణమిస్తారని అనిపించే ప్రత్యర్థుల ఆందోళనల విషయంలో ప్రభుత్వాలు దుర్మార్గమైన అణచివేత విధానాల్ని అవలంబిస్తుంటాయి. ఉద్యమాల సమయంలో హౌస్ అరెస్టులు, పరామర్శల సమయంలో అనుమతి నిరాకరణలు, నిర్బంధాలు ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. 

కానీ, కెఎ పాల్ స్థాయి ఎంత? ఆయన శక్తి ఎంత? వడగండ్ల బాధిత రైతులను పరామర్శించడానికి ఆయన వెళితే, తెరాసకు వాటిల్లగల నష్టం ఎంత? పోనీ, ఆయన ఆ పర్యటన వల్ల శాంతి భద్రతల సమస్య ఏర్పడేంత సీన్ ఆయనకు ఉన్నదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. 

కెఎపాల్ ను కూడా రైతుల పరామర్శకు వెళ్లనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటున్నదంటే.. ఆయనను చూసి కూడా జడుసుకునే స్థితికి వచ్చిందా అనే అనుమానం, జాలి కలుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?