Advertisement

Advertisement


Home > Politics - Telangana

జగన్ బాటలో టీడీపీ..! పరువుపోయే కామెడీ!!

జగన్ బాటలో టీడీపీ..! పరువుపోయే కామెడీ!!

తెలుగుదేశం పార్టీ కూడా అచ్చంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తోంది. అంతకు మించి.. తమ శక్తి సామర్థ్యాలు బలం గురించి ఇంకా పెద్దపెద్ద కామెడీ డైలాగులు వేస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ ‘గడపగడపకు వైసీపీ’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంటే.. వాళ్లు ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. మరీ ఇంత పచ్చి కాపీనా అని కంగారు పడకండి.. ఏపీలో కాదు. ఇది సిగ్గుమాలిన కాపీ వ్యవహారమే అయినా.. తెలంగాణ తెలుగుదేశం ఇలాంటి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.

గతంలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన తిరుగులేని అభివృద్ధిని గురించి వివరించడానికి ఈ ‘ఇంటింటికీ..’ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. 

అయినా కాసాని తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. తెలుగుదేశం గతంలో ఏలినప్పుడు ఎంత అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీని ప్రస్తుతం తెలంగాణలో సున్నా సీట్లకు పరిమితం చేశారు. ఆ పార్టీనే నమ్ముకుంటే.. తమ రాజకీయ భవిష్యత్తు కూడా అంధకార బంధురం అయిపోతుందనే భయంతో అంతా తట్టాబుట్టా సర్దుకుని ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.

కాసానికంటె ముందుపార్టీ అధ్యక్ష పదవి వెలగబెట్టిన రమణ కూడా ఇప్పుడు గులాబీదళంలో ఉన్నారు. అలాంటిది తెలుగుదేశం చేసిన అభివృద్ధిని కొత్తగా వచ్చిన కాసాని ఏ ప్రజలకు వివరిస్తారో అర్థంకాని సంగతి. 

తాజాగా జ్ఞానేశ్వర్.. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో పార్టీ సమీక్ష జరిపారు. ఆ మాత్రం యాక్టివిటీ తెలంగాణ తెలుగుదేశంలో జరగడమే చాలా పెద్ద సంగతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ మన పార్టీ పోటీచేస్తుందని ప్రకటించారు. ఈ మాట విని జనం నవ్వుకుంటున్నారు. అసలు 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు సభ్యత్వం కూడా లేనివి ఎన్ని ఉన్నాయో ఈ కొత్త అధ్యక్షుడికి లెక్క తెలుసా? అనుకుంటున్నారు.

అటువైపు అధికారం ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా.. మొత్తం 175 స్థానాల్లో పోటీచేసి తీరుతాం అని చెప్పే ధైర్యం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకే లేదు. ఎవరు వచ్చి పొత్తుల్లో కలుస్తారా..? వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేసి.. వారి భుజాల మీద ఎక్కి సీఎం పదవిలోకి వెళ్లిపోదామా? అనే కోరికతోనే ఆయన ఉన్నారు. అలాంటిది.. ఒక్కసీటుకు కూడా దిక్కులేని, తెలంగాణలో మాత్రం.. 119 నియోజకవర్గాల్లో పార్టీని బరిలోకి దింపుతామని అనడం కామెడీ కాక మరేమిటి? అని ప్రజలు అనుకుంటున్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ ప్రస్తుతం కొత్తగా పదవి వచ్చిన కిక్కులో ఉన్నారని.. నెమ్మదిగా ఆ కిక్కు దిగిన తర్వాత అంతా సర్దుకుంటుందని జనం జోకులేసుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?