Advertisement

Advertisement


Home > Politics - Telangana

జయసుధకు సికింద్రాబాద్ ఎంపీ.. అంత వీజీనా?

జయసుధకు సికింద్రాబాద్ ఎంపీ.. అంత వీజీనా?

పార్టీలో చేరుతానంటే.. ఖచ్చితంగా దక్కే పదవులను ఆమెకు ఆఫర్ చేస్తారు. రాజకీయ హోదాకు ఢోకా లేకుండా కూడా చూసుకుంటారు. అంతేతప్ప.. ఫలానా సీటు ఇస్తేనే పార్టీలోకి వస్తా.. అని తానే టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫైన్ చేయడానికి పూనుకుంటే వారు ఒప్పుకుంటారా? సాధ్యమేనా? ఇలాంటి గడబిడతోనే వెటరన్ సినీ నటి జయసుధ, భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పడ్డట్టుగా కనిపిస్తోంది. 

సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేట్లయితే బిజెపిలో చేరుతానని కోరడం వల్లనే.. ఆమెతో మంతనాలు జరిపిన రాష్ట్ర కమలనాయకులు తక్షణామోదం తెలియజేయలేక ఢిల్లీ మీద నెట్టేసి చేతులు దులుపుకున్నట్టుగా వినిపిస్తోంది. జయసుధ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టుగా కొన్నిరోజులుగా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె చేరికకు ఈ పుకార్లు ముహూర్తం కూడా నిర్ణయించేశాయి. 

ఈనెల 21న మునుగోడులో అమిత్ షా నిర్వహించే భారీ బహిరంగ సభ వేదిక మీదనే జయసుధ కూడా కమలతీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. 21నాటికి ఇతర పార్టీల నుంచి వీలైనంత మంది నేతలను బిజెపిలోకి వలసలు తీసుకురావాలని రాష్ట్రనాయకులంతా అదే పనిగా కృషిచేస్తున్న తరుణంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న జయసుధకు సంబంధించిన పుకార్లు నమ్మశక్యంగానే అనిపించాయి. కానీ ఈ విషయంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదని, 21న భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. 

జయసుధకు రాజకీయ అనుభవం కొంత ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో ఆయన ప్రాపకంతో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో కూడా ఆమె ఎంపీ సీటునే ఆశించారు గానీ.. పని జరగలేదు. ఆ టర్మ్ పూర్తి కాగానే మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఎటూ సినిమాలు తగ్గిపోయాయి గనుక.. మళ్లీ రాజకీయాల వైపు చూడడం సహజం. బిజెపి సంప్రదించినప్పుడు.. పార్టీలోకి రావడానికి ఆమె సుముఖంగానే ఉన్నారు గానీ.. సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇచ్చేట్లయితే పార్టీలోకి వస్తానని అన్నట్లుగా సమాచారం. అది కాకపోతే.. రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తోంది. 

జయసుధకు ప్రస్తుతం రాజ్యసభ సీటు తాయిలంగా ఇచ్చేంత జనాకర్షణ శక్తి ఉన్నదా అనే మీమాంసలో కమలదళం ప్రస్తుతం ఉంది. సికింద్రాబాద్ సీటు ఇవ్వడం మాత్రం అసాధ్యం. ఆ సీటునుంచి ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయన రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగితే.. ఎమ్మెల్యే బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదుగానీ.. బిజెపికి లడ్డూ వంటి ఆ సీటును కొత్తగా వచ్చే జయసుధకు ఇస్తారా? ఆమె తన సొంత చరిష్మా కూడా చూపించి గెలుచుకోవాలనే ప్రతిపాదనతో మరొక సీటు కేటాయిస్తారా? అనేది క్లారిటీ లేదు. 

గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రబాద్ ఎమ్మెల్యే సీటు అయితే.. మారు మాట్లాడకుండా పార్టీ ఇవ్వగలదు. కానీ అందుకు జయసుధ సుముఖంగా లేదు. మొత్తానికి కమలం టీమ్ తో బేరం కుదరకనే ప్రస్తుతానికి చేరిక ఆలోచనను జయసుధ సస్పెన్స్ లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?