Advertisement

Advertisement


Home > Politics - Telangana

జీవితకు ఎంపీ టిక్కెట్ ఇస్తే మరి రాములమ్మ సంగతేమిటి?

జీవితకు ఎంపీ టిక్కెట్ ఇస్తే మరి రాములమ్మ సంగతేమిటి?

ఈ తరానికి పెద్దగా పరిచయం లేని ఒకప్పటి నటి జీవితా రాజశేఖర్ (ఒకప్పటి హీరో రాజశేఖర్ భార్య) కొంత కాలం కిందటే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆమె బీజేపీ నాయకత్వానికి ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏమిటా కండీషన్? ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలో చేరతానని అన్నదట. పార్టీ నాయకత్వం సరేనని హామీ ఇచ్చిందట. 

ఒకప్పుడు జీవిత బీజేపీ నాయకురాలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. అయితే... ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదట.

ఇటీవల రాజశేఖర్, జీవిత దంపతులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించగా... గతంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని తెలియజేసినట్లు తెలిసింది. ప్రచారానికి కాకుండా పోటీ చేయడానికి తాము సిద్ధమని, టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే మళ్ళీ పార్టీలోకి వస్తామని సూటిగా చెప్పిందట .  

తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ...ఏపీ, తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే పోటీ చేయడానికి తాను సిద్ధమే అని బీజేపీ నాయకులకు జీవిత తెలియజేయడంతో ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. తెలంగాణలోని జహీరాబాద్ నుంచి ఆమెను పోటీ చేయించాలని పార్టీ ఆలోచిస్తోందట. 

జీవిత మంచి వాగ్ధాటి గల నాయకురాలు. సూటిగా, స్పష్టంగా తాను చెప్పదలుచుకున్న అంశాలను బలంగా ప్రజలకు చెప్పగలదు. తెలుగులోనే కాదు ఇంగ్లిష్ లోనూ అనర్గళంగా మాట్లాడగలదు. అటువంటి మహిళా నేత తమ పార్టీకి అవసరమని బీజేపీ భావిస్తోందట. దీని వెనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 'ప్రవాస్ యోజన'లో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జహీరాబాద్ ఇంఛార్జ్‌గా నియమించారు. 

జహీరాబాద్ ఎంపీగా మహిళను నిలబెడితే ప్రయోజనం ఉంటుందని నిర్మలా సీతారామన్ ఆలోచనగా ఉందట. టికెట్ ఇస్తేనే పార్టీలో యాక్టివ్ అవుతానని జీవితా రాజశేఖర్ చెప్పడం, జహీరాబాద్ ఎంపీగా మహిళా అభ్యర్థి అయితే బావుంటుందని నిర్మలా సీతారామన్ ఆలోచనల్లో ఉండటంతో జీవితకు టికెట్ ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. 

ఇప్పటివరకు ఉన్న అంచనా ఇది. ఎంపీ టిక్కెట్లు డిసైడ్ చేయడం అనేది తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ జీవితకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయ్యిందనే అనుకుందాం. మరి అటువంటప్పుడు పార్టీలో సీనియర్ నాయకురాలైన విజయశాంతి అలియాస్ రాములమ్మ పరిస్థితి ఏమిటి? ఆమె కూడా బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించింది. తరువాత తల్లి తెలంగాణా పార్టీ పెట్టింది. దాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసింది. ప్రత్యేక తెలంగాణా వచ్చినప్పుడు ఆమె గులాబీ పార్టీ ఎంపీగా ఉంది. ఆ తరువాత కేసీఆర్ తో వచ్చిన గొడవల కారణంగా కాంగ్రెస్ లో చేరింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆ పార్టీలోనూ అసంతృప్తిగానే కాలం గడిపింది. చివరకు మళ్ళీ బీజేపీలోనే చేరింది. చేరినప్పుడు ఏ కండీషన్ పెట్టిందో తెలియదు. కానీ పార్టీలో అసంతృప్తిగానే ఉంది. ఈ మధ్యనే ఆ విషయం చెప్పింది కూడా. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆమె బాధపడుతోంది. ఆమె కోరిక కూడా ఎన్నికల్లో పోటీ చేయడమే. ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచింది కాబట్టి మరోసారి పోటీ చేయాలనే కోరిక తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ జీవితకు టిక్కెట్ ఇచ్చి విజయశాంతికి ఇవ్వకుంటే ఆమె పార్టీలో ఉండాలా, వద్దా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?