Advertisement

Advertisement


Home > Politics - Telangana

త్వరపడుతున్న ఎగిరే చిలకలు!

త్వరపడుతున్న ఎగిరే చిలకలు!

పార్టీ మారడానికి ఉత్సాహపడుతున్న వారంతా ఇప్పుడు సత్వర నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఒకవైపు తన మూడోవిడత పాదయాత్ర కొనసాగిస్తూనే.. అధికార పార్టీమీద నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు తెరమీద కనిపించకుండా.. కార్యం చక్కబెట్టగల బిజెపి కీలక నేతలు.. రాజధానిలో కూర్చుని.. ఇతర పార్టీల వారికి గేలం వేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. రాబోయే రెండు వారాల్లోగా మరింత మంది నాయకులను కమలదళంలో చేరడానికి సిద్ధం చేయబోతున్నారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడే తెలంగాణ రాజకీయం హీట్ పెరిగింది. సాధారణంగా.. ఆ స్థాయి నేతలు పార్టీలో చేరేప్పుడు ఎంచక్కా ఢిల్లీ వెళ్లి అక్కడ అగ్రనేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుని తిరిగివచ్చి.. స్థానికంగా రాజకీయం ప్రారంభిస్తారు. కానీ.. కోమటిరెడ్డి రాజగోపాల్.. తన రాజీనామాను ప్రకటించిన తర్వాత.. ఢిల్లీ వెళ్లి.. అమిత్ షాను తెలంగాణ తీసుకురావడానికని రంగం సిద్ధం చేసుకుని వచ్చారు. పార్టీలో ఇది ఆయన సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. భాజపాలో చేరే కార్యక్రమం కోసం అమిత్ షా హైదరాబాదులో సభకు హాజరవుతుండడం అనేది గొప్ప విషయమే. కాకపోతే ఈ ఏర్పాటు వల్ల.. బీజెపిలోకి చేరదలచుకున్న వారిలో జోరు పెంచినట్లుగా కనిపిస్తోంది. త్వరగా నిర్ణయం తీసుకుంటే అమిత్ షాతో కండువా కప్పించుకుని పార్టీలో చేరే అవకాశం ఉంటుందనే ఆశ వారిని త్వరగా నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తోంది. 

కాంగ్రెస్ లో కీలక నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా చేసేశారు. దాసోజు శ్రవణ్ టీపీసీసీ మీద.. రేవంత్ రెడ్డి మీద చాలా చాలా ఆరోపణలు చేశారు. ఆయనను బిజెపిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా బండిసంజయ్ ఒక ప్రకటన చేయగా, ఆయన కూడా చేరబోతున్నారని ఈటల తేల్చి చెప్పేశారు. మొత్తానికి దాసోజు బిజెపి చేరిక ఖరారైంది. 

కాంగ్రెస్ నుంచి గానీ ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరదలచుకునే వారికి ఇది మంచి తరుణం అని కమలదళాలు ప్రచారం చేస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరడం అనేది గుర్తింపు పరంగా బాగుంటుందనే మాటతో ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

అమిత్ షా వచ్చేలోగా ఎంత ఎక్కువ మంది పార్టీలోకి వచ్చేలా పావులు కదిపితే.. రాష్ట్ర పార్టీ నాయకులకు అంతగా గుర్తింపు ఉంటుందనేది వారి ఆరాటం. మొత్తానికి 21న అమిత్ షా తెలంగాణలో సభ పెడితే.. అది కేసీఆర్ మీద సమర శంఖారావంలాగానే ఉంటుందని కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?