Advertisement

Advertisement


Home > Politics - Telangana

కమలదళంలోకి మరో మాజీ గులాబీ!

కమలదళంలోకి మరో మాజీ గులాబీ!

తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారా? చాలాకాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కృష్ణారావు చేరికతో బిజెపి తెలంగాణలో కొత్త శక్తిని సంతరించుకోబోతున్నదా? అనే ప్రశ్నలు ఇపుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు బిజెపిలో చేరడం జరిగితే ఆ పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో తలపడడానికి ఆర్థికంగా కూడా పెద్ద దన్ను దొరికినట్టే అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా పనిచేసిన జూపల్లి కృష్ణారావు రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. సీనియర్ అయినప్పటికీ.. మంత్రిపదవుల విషయంలో తొలుత కేసీఆర్ ఆయననను పక్కన పెట్టారు. కానీ.. అప్పట్లో ప్రభుత్వంలో తమ మాట నెగ్గించుకోగల స్థితిలో ఉన్న జూపల్లి రామేశ్వరరావు గట్టిగా పట్టుపట్టడంతో జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. 2018 ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయంగా స్తబ్దంగానే ఉన్నారు. 

జూపల్లి మరో ప్రస్థానం పేరి కృష్ణారావు తాజాగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం పల్లెపల్లెకూ వెళ్తానని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానని అంటున్నారు. తెలంగాణను ఎందుకోసం సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరడం లేదని కృష్ణారావు అనడం విశేషం. తాను ఏ పార్టీలో చేరాలనేది ప్రజలే నిర్ణయిస్తారని కూడా జూపల్లి అంటున్నారు. కాస్త ప్రజల్లో తిరిగి తర్వాత తన నిర్ణయం ప్రకటించే ఉద్దేశంతో ఆయన ఇలా అంటున్నట్టుగా కనిపిస్తోంది గానీ అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం జూపల్లి కృష్ణారావు కమలదళంలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. 

మైహోమ్ అధినేత, మీడియా సంస్థలను కూడా కలిగి ఉన్న జూపల్లి రామేశ్వరరావు అండదండలు కృష్ణారావుకు పుష్కలంగా ఉన్నాయి. ఆయన చొరవతోనే తెరాస సర్కారులో ఆయన మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో తెరాస సర్కారుకు అన్నీ తానై వ్యవహరించిన జూపల్లి రామేశ్వరరావు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉన్నట్టుగా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు తన ‘మరో ప్రస్థానానికి’ మార్గం ఎంచుకుంటే.. అది ఖచ్చితంగా కమలం దిశగానే ఉంటుందనేది అందరి అంచనా. 

అదే జరిగితే గనుక.. తెలంగాణలో ఆర్థిక వనరుల పరంగా, మీడియా మద్దతు పరంగా భారతీయ జనతా పార్టీకి ఒక దన్ను దొరికినట్టు అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో అధికారం దక్కుతుందనే ఉద్దేశంతో మీడియాలోకి అనేకమంది బిజెపి నాయకులు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు చేరిక వారికి అదనపు బలం అవుతుందనడంలో సందేహం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?