Advertisement

Advertisement


Home > Politics - Telangana

అలవిమాలిన ఆదర్శాలు వల్లిస్తున్న కేసీఆర్

అలవిమాలిన ఆదర్శాలు వల్లిస్తున్న కేసీఆర్

కేసీఆర్ ఆదర్శాలు వల్లిస్తున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి. వింటున్నవారికి నోరూరుతుంది. భారాస పేరుతో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత.. దేశాన్నంతా ఆకర్షించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. తమది రైతు అనుకూల పార్టీ అని అంటున్నారు. రైతులకోసమే పనిచేస్తామని, రైతుల చేతిలోనే అధికారం ఉంటుందని.. అంతా.. రైతు ఆధారిత ప్రకటనలే గుప్పిస్తున్నారు. 

దేశమంతా పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా.. తాజాగా ఒడిశాలోకి భారాస అడుగులు పడ్డాయి. ఒకప్పటి ఒడిశా ముఖ్యమంత్రి ఎంపీగా కూడా పలుమార్లు సేవలందించిన సీనియర్ నాయకుడు గిరిధర్ గొమాంగ్ భారాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా ఆదర్శాలను వల్లించారు.

ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి.. నాయకులు గెలుస్తున్నారు..ఎన్నికల తర్వాత ప్రజలు ఓడిపోతున్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉంది. ఎన్నికల్లో పార్టీలు కాదు.. ప్రరజలు గెలవాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు అని కేసీఆర్ అంటున్నారు. 

ఆహా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాస్వామిక విలువల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో కదా అని మనకు అనిపిస్తుంది. ప్రజలు ఓడిపోతుండడం నిజమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు.. తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్, యావత్ దళిత జాతిని ఓడగొట్టారు. ఇప్పుడు ఓడిపోయే వంతు రైతుల పరమైనట్లుగా ఉంది. ఇదివరలో దళిత ఉద్దరణ మాటలు మాట్లాడుతూ వచ్చిన.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడానికి దళిత కార్డు కంటే రైతు కార్డు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

నాయకులు గెలవడం ప్రజలు ఓడిపోవడం జరుగుతోందని అంటున్న కేసీఆర్ అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజలు గెలవడం అంటే ఏమిటి? ఎన్నికల్లో ఆర్థిక వనరులతో నిమిత్తం లేకుండా నిజాయితీ పరులు, నలుగురికోసం పనిచేసేవారికి తాను టికెట్లు ఇస్తానని ఆయన దమ్ముగా చెప్పగలరా? వందల కోట్లు మూలిగే గెలుపుగుర్రాల కోసం వెంపర్లాడకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పగలరా? మరి ప్రజలు గెలవడం అంటే ఏమిటి? 

సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలు కొన్ని సుద్దులు చెబుతుంటాయి. సమసమాజం గురించి, అవినీతి నిర్మూలించడం గురించి, ధనిక పేద తారతమ్యాలను నిర్మూలించడం గురించి వారు అనేక ఆదర్శాలను వల్లిస్తుంటారు. సాధారణంగా వారు అధికారంలోకి వచ్చే అవకాశం దరిదాపుల్లో ఎప్పటికీ కనపడని రాష్ట్రాల్లో ఇలాంటి ఆదర్శాలు వల్లించడం మరింత ఎక్కువగా జరుగుతుంటుంది. తాము అధికారంలోకి రాబోయేది లేదు గనుక.. ఎన్ని మాటలు చెప్పినా నడుస్తుంది అనే సిద్ధాంతం వారిది. కేసీఆర్ తీరుకూడా అలాగే కనిపిస్తోంది. రైతు గెలవాలి.. ప్రభుత్వాలు కాదు అని అంటున్న ఆయన మాటల తీరు ఆ వైఖరినే గుర్తుకు తెస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?