Advertisement

Advertisement


Home > Politics - Telangana

వంద సీట్లు దాటవు : కేసీఆర్ అంచనా

వంద సీట్లు దాటవు : కేసీఆర్ అంచనా

తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ అంటే మూడోసారి అధికారంలోకి రావాలని దీంతో హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కలలు కనడమే కాదు తప్పనిసరిగా అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఎన్నికలకు తక్కువ సమయం ఉంది కాబట్టి. అందుకే ఆయన ఇప్పటినుంచే సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. వాటిని స్టడీ చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేస్తున్నారు. మూడోసారి అధికారం చేపట్టి.. 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే ఆయనకు అందిన సర్వే రిపోర్టుల ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి వంద సీట్లకంటే తక్కువగానే వస్తాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది అంటే 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 సాధించింది. ఇది బొటాబొటి మెజారిటీయే. తెలంగాణా సాధించిన రాష్ట్రంగా టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఆ పార్టీ ఫిరాయింపులకు తెరతీసింది. ఇక 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాలు సాధించింది. ఇది కూడా తక్కువ మెజార్టీయే. దీంతో ఇంకా భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను నీరుగార్చింది. 

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ వచ్చేసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. మునుగోడు ఉప ఎన్నికలో సర్వశక్తులు ఒడ్డి పోరాడింది అందుకే. గెలిచింది కానీ భారీ మెజారిటీ రాలేదు. ఓడిపోయినా బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ కు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే టీఆర్‌ఎస్‌ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కేసీఆర్ చేయించిన సర్వేల్లో ఈ విషయం బయటపడింది. వచ్చే ఎన్నికల్లోనూ వందలోపే సీట్లు వస్తాయని తేలింది. అందుకే  నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, నేతల పనితీరును అంచనా వేస్తూ పార్టీని వచ్చే ఎన్నికల కోసం మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉండటం, రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకుంటున్న క్రమంలో కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం ముందుగానే పూరించారు.

ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరు, పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల ఆధారంగా కచ్చితంగా గెలిచే, కాస్త కష్టపడితే గెలిచే, ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్న నియోజవర్గాలను గుర్తించి మూడు కేటగిరీలుగా పరిగణించారు. కచ్చితంగా గెలిచే కేటగిరీ 'ఏ' లో 38 నుంచి 44, కాంగ్రెస్‌ బలంగా ఉండి కాస్త కష్టపడితే గెలిచే కేటగిరీ 'బీ'లో 30 నుంచి 35 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు.. కానీ అటు ఇటు అయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరోలా ఉంటుంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీక్‌గా ఉన్నారని తెలిసింది. 

బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆర్ ఫోకస్ చేశారు. సదరు అభ్యర్థుల విజయం కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టిసారించేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తారట. త్వరలో ఇంచార్జీలను కూడా నియమిస్తారట. వారిని ఈ ఏడాది తిప్పి ఫలితం తారుమారయ్యేలా చేస్తారని తెలిసింది.  

సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయి. గెలవడం కష్టంగా ఉన్న చోట.. సర్వ శక్తులు ఒడ్డుతారు. ప్రభుత్వం చేసిన పనులను వివరించి జనం మూడ్ మార్చుతారు. లేదంటే తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆయా చోట్ల కమ్యూనిటీని బట్టి ఆకట్టుకునే పనులు ఉంటాయి. ఉదహరణకు దళితులు ఎక్కువ మంది ఉంటే దళిత బంధు ఇస్తామని చెబుతారు. బీసీలు ఉంటే.. వారికి వెహికిల్ లోన్స్, ఇతర రుణ సదుపాయం అని చెబుతారు. ఇలా అందరినీ ఆకట్టుకొని.. అల్టిమేట్‌గా గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ మేరకు ముందడుగు వేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?