Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఇద్దరు ఆహ్వానిస్తున్నా వరించేది ఒక్కరినే కదా!?

ఇద్దరు ఆహ్వానిస్తున్నా వరించేది ఒక్కరినే కదా!?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. సుమారుగా ఒకటిన్నర ఏడాది దూరంలోనే ఎన్నికలు ఉన్నాయి. పైగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా కాకుండా.. ఇక్కడ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉండడంతో.. ప్రధాన పార్టీలు గేరు మార్చి పోరాడుతున్నాయి. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పునరేకీకరణలు జరుగుతున్నాయి. కీలక నాయకులు పార్టీలు మారడం వంటి వ్యవహారాలు కూడా చోటు చేసుకోనున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలోని ఒక కీలక నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గురించిన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటే అగ్రనాయకుల్లో ఒకరు. ఆయన గతంలో తెరాస తరఫున ఎంపీగా కూడా చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అనేది ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదనే ఏర్పడింది. అంత ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా తటస్థంగా ఉన్నారు. 

ఈ విషయాన్నే ఆయన తాజాగా ప్రకటిస్తూ.. తాను ఏ పార్టీలోనూ లేనని వెల్లడించారు. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫాంహౌస్ కు వెళ్లి మంతనాలు చేశారని వార్తలు వచ్చాయి. ఆ విషయం అంగీకరిస్తూనే, తాను రేవంత్ రెడ్డిని కలిసినట్లు వచ్చిన పుకార్లను కొండా కొట్టి పారేస్తున్నారు. 

కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలనుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయని.. తెరాసను బలంగా ఎదుర్కొనే పార్టీలోకి వెళ్లాలా.. తానే సొంతంగా పార్టీ పెట్టాలా? అనే ఆలోచన చేస్తున్నానని విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నారు. 

ఆయనకు రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్న సంగతి నిజమే కావొచ్చు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ ఫాంహౌస్ కు వెళ్లి మంతనాలు సాగించడం తదితర వ్యవహారాలు గమనిస్తోంటే.. ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని, ఆయన బిజెపిలో చేరబోతున్నారని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఆ వార్తలను పెద్దగా ఖండించలేదు. కాంగ్రెస్ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ లో కూడా అసంతృప్తి ఉంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా వెళ్లి రాజగోపాల్ ను కలవడం ఒక కీలక సంకేతమే. 

ఈ ఇద్దరు ముఖ్యనేతలు కూడా కమలతీర్థం పుచ్చకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బండి సంజయ్ సాగిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సమయానికి నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారని సమాచారం. ఆ కార్యక్రమంలో.. ఇతర పార్టీలనుంచి కమలదళంలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగే అవకాశం కూడా ఉంది. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కూడా అదే రోజున బిజెపిలో చేరుతారా.. మరికొంత కాలం వేచిచూస్తారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?