Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆమె ప్రమాణమే చేయలేదు ...అప్పుడే కేటీఆర్ డిమాండ్లు, ఫిర్యాదులు

ఆమె ప్రమాణమే చేయలేదు ...అప్పుడే కేటీఆర్ డిమాండ్లు, ఫిర్యాదులు

కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేదే ఎప్పుడూ టీఆర్ఎస్ ఆలోచన. అందుకు ఎలాంటి అవకాశం దొరికినా వదిలిపెట్టదు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. బాధ్యతలు స్వీకరించలేదు. ఇప్పుడున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు 24 న వీడ్కోలు పలికాక 25 న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

ప్రమాణ స్వీకారం చేశాక ఆమె కాస్త కుదురుకోవాలి. దేశ పరిస్థితులు అర్ధం చేసుకోవాలి. ఇంకా యేవో కొన్ని పనులుంటాయి. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ అప్పుడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు కోన్ని డిమాండ్లు పెట్టారు. కేంద్రం మీద ఫిర్యాదులూ చేశారు. ఆమెను నేరుగా కలుసుకోలేదనుకోండి. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెబుతూనే మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఆమె ముందు అనేక డిమాండ్లు ఉంచారు. 

గిరిజన బిడ్డగా చొరవ చూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, తెలంగాణ పల్లెల్లో ఎక్కడా కరెంటు కష్టాలు లేవని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని చెప్పారు. ఇక ఇదే సమయంలో పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునే విధంగా అవకాశం కల్పించడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కృషిచేయాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో  ఉందని, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుపైనా కేంద్రాన్ని ఒప్పించాలని ద్రౌపదీ ముర్మును కోరారు కేటీఆర్. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఎన్నో రెట్లు ఎక్కువ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. 

టీఆర్ఎస్ పార్టీ పై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు ఉన్నాయని కేంద్రమే చెప్పిందని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణకు తాము ఎంతో ఇస్తున్నామని మాట్లాడుతున్నారని, కానీ ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణాకు కేంద్రం ఇచ్చిన దానికంటే, రాష్ట్రం కేంద్రానికి ఇచ్చినదే ఎక్కువ అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?