Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఈ మాట పదేళ్లలో అనలేదేం కేటీఆర్?

ఈ మాట పదేళ్లలో అనలేదేం కేటీఆర్?

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వెల్లడించారు. 

తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనే మాట కేటీఆర్ నోటి నుంచి రావడం చాలా చిత్రంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికలలో ఓడిపోవడానికి అసలు కారణాలు ఏమిటో విశ్లేషించుకున్న తర్వాత పాలకులుగా తాము ఇన్నాళ్ళు ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం అనే స్పష్టత కేటీఆర్ కు వచ్చినట్లుగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ జ్ఞానోదయం కలగడం అనేది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెత చందంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పదేళ్ల భారత రాష్ట్ర సమితి పరిపాలనలో పాలకులు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యమంత్రి స్థానంలోని కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభలలో తప్ప ప్రజలను కలవడం అనేది అనూహ్యమైన సంగతి. మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకడం ఒక పట్టాన సాధ్యం కాదని అందరికీ తెలుసు. 

అదే క్రమంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక నాయకుడిగా ప్రభుత్వంలో చక్రం తిప్పిన కేటీఆర్ పరిస్థితి కూడా భిన్నమైనదేమీ కాదు. ఆయన మంత్రి స్థాయి నాయకులకు అందుబాటులో ఉండే వారే గాని ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ అతి అరుదుగా ఇస్తుంటారనే వాదన ఉంది. అంతకంటే కిందిస్థాయి పార్టీ నాయకులు కేటీఆర్ ను కలవడం కూడా దుర్లభం.

సొంత పార్టీ నాయకుల సంగతే ఇలా ఉంటే.. ఇక ప్రజల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేనేలేదు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు అనే అపప్రధ బలంగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు ప్రవర్తన శైలి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన ఆయన తన నియోజకవర్గంలో ప్రతిరోజు వినతులతో వచ్చే ప్రజలను కలుస్తూ ఉండేవారు. అందుకే గత ఎన్నికల కంటే కొంత తగ్గినప్పటికీ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఇదిలా ఉండగా పార్టీని దారుణమైన ఓటమి పలకరించిన తర్వాత తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం అని కేటీఆర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. అధికారంలో ఉన్నంతకాలం తాము చేసిందే పని అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజలను కలవడానికి దూరంగా ఉండిపోయిన ఈ నాయకులు.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని ప్రజలకు అందుబాటులో ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటాం వంటి పడికట్టు మాటలను పక్కనపెట్టి కేటీఆర్ కనీసం ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలకు, కిందిస్థాయి నాయకులకు కూడా నేరుగా తాను అందుబాటులో ఉండడం అలవాటు చేసుకుంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?