Advertisement

Advertisement


Home > Politics - Telangana

తిన్నారు తాగారు వెళ్లారు

తిన్నారు తాగారు వెళ్లారు

తెలంగాణ‌లో రాజ‌కీయం రోజురోజుకూ హీటెక్కుతోంది. మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌కు ప‌దును పెట్టారు. విమ‌ర్శ‌ల తీవ్ర‌త‌ను పెంచుతున్నాయి. ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌భ‌కు ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ వ‌చ్చారు. కేసీఆర్ స‌ర్కార్‌పై దుమ్మెత్తి పోసి వెళ్లారు.

ఇప్పుడు బీజేపీ వంతు వ‌చ్చింది. తేలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ‌చ్చారు. కేసీఆర్ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ చేయ‌న‌న్ని అప్పులు కేసీఆర్ స‌ర్కార్ చేసిందని ఘాటు ఆరోప‌ణ‌లు చేశారు. ‘ఎందుకోసం ఈ అప్పులు? కొడుకు, కూతురి కోసమా? ఇన్ని కుంభకోణాలకు పాల్పడినా.. ఇంకా మీ కడుపు నిండలేదా?’ అని అమిత్‌షా ప్రశ్నించారు. తాను 13 ఏళ్ల వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు తన వయసు 57 ఏళ్లు అని, ఇప్పటి వరకు ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అమిత్‌షా విరుచుకుప‌డ్డారు.

రాహుల్‌గాంధీ, అమిత్‌షాల ప‌ర్య‌ట‌న‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్స్ విసిరారు. శ‌నివారం రాత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం కేటీఆర్ త‌న మార్క్ పంచ్‌ల‌తో బీజేపీపై విరుచుకుప‌డ్డారు. కేటీఆర్ ట్వీట్ ఏంటో చూద్దాం.

‘బీజేపీ ద్రోహ చింత‌, అబ‌ద్ధాల‌తో బ‌తుకుతోంది. గ‌త 8 ఏళ్లుగా ఏమీ ఇవ్వ‌లేదు. ఇప్పుడూ అదే నిర్ల‌క్ష్యం కొన‌సాగుతోంది. బీజేపీ అంటే (బ‌క్వాస్, జుమ్లా, పార్టీ) మ‌తిలేని, బూట‌క‌పు హామీల పార్టీ. తెలంగాణాలో ప‌ర్యాట‌క సీజ‌న్ కొన‌సాగుతోంది. మొన్న‌నే ఒక ప‌ర్యాట‌కుడు వ‌చ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మ‌రో ప‌ర్యాట‌కుడు వ‌చ్చారు. తిన్నారు...తాగారు...వెళ్లారు (ఖాయా, పియా, చ‌ల్‌దియా)’ అని కేటీఆర్ సెటైర్స్ విసిరారు. బీజేపీ విమ‌ర్శ‌ల‌పై తెలంగాణ అధికార పార్టీ చాలా వేగంగా కౌంట‌ర్ ఇస్తోంది.

త‌మ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు ఒకట్రెండు విమ‌ర్శ‌లు చేస్తే, అధికార పార్టీ దీటుగా ప‌దుల సంఖ్య‌లో కౌంట‌ర్లు ఇవ్వ‌డం విశేషం. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌పై కేసీఆర్ స‌ర్కార్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంద‌నేందుకు తాజాగా కేటీఆర్ ట్వీటే నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కేటీఆర్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?