Advertisement

Advertisement


Home > Politics - Telangana

తప్పులు చేయకుంటే ఎందుకింత ఆగ్రహం ....హడావుడి..?

తప్పులు చేయకుంటే ఎందుకింత ఆగ్రహం ....హడావుడి..?

ప్రస్తుతం మనదేశ రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నిజాయితీగా ఉన్నవారు, అక్రమాలు చేయనివారు, ప్రజాధనం దోచుకోనివారు కాగడా వేసి వెతికినా కనిపించరు. ఇలాంటి వారిలో తెలంగాణా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఒక భాగమే. అందులో సందేహం లేదు. ఐటీ దాడుల నేపథ్యంలో గత మూడురోజులుగా ఆయన చేసిన హడావుడి, వెలిబుచ్చిన ఆగ్రహం చూశాక ఈయన పత్తిత్తు కాదని, గుండెలు తీసిన బంటు అని అర్ధమవుతుంది. 

సాధారణంగా తెలంగాణా మంత్రులు ఈడీ ...బోడి దాడులకు భయపడమని చెబుతుంటారు. కానీ మల్లారెడ్డి భయపడినట్లు చాలా స్పష్టంగా అర్ధమైంది. తాను భయపడకపోతే, నిజాయితీగా ఉంటే అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వాలి. కానీ మంత్రి అందుకు భిన్నంగా వ్యవహరించారు. మంత్రి మల్లారెడ్డి ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలతో, ఆదాయపన్ను శాఖ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేసి వారి పైన కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఐటీ దాడుల నేపథ్యంలో చేసిన ఓవరాక్షన్ ఆయనను మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెడుతుందేమో అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. 

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తమ ఆస్తులపై దాడులు చేసిన ఐటీ అధికారులతో చాలా దారుణంగా వ్యవహరించారు. ఐటీ అధికారుల ల్యాప్ టాప్ లాక్కోవడం, ఐటీ అధికారులు తన కుమారుడిని కొట్టారని సంచలన ఆరోపణలు చేయడం, తన కుమారుడితో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అంటూ ఆరోపించడం, పైగా ఐటీ అధికారుల పైన కేసులు పెట్టడం సంచలనంగా మారింది.

ఐటీ అధికారుల దాడులకు తాము భయపడేది లేదని చెబుతూనే, అధికారుల దాడులను అడ్డుకోవడం కోసం మంత్రి మల్లారెడ్డి నానా హంగామా చేశారు. వైద్య కళాశాలకు మూడేళ్లలో 100 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్టు తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సి ఆర్ పి ఎఫ్ పోలీసులతో తన కుమారుడిని తీవ్రంగా కొట్టారని, అందుకే తన కుమారుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఐటి అధికారులు దిండిగల్ పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లారెడ్డి పై కంప్లైంట్ ఇచ్చారు. 

తమ అధికారిని మంత్రి మల్లారెడ్డి నిర్బంధించారని, అధికారి నుండి ల్యాప్ టాప్ కూడా లాక్కున్నారని, తమ విధులు తమను నిర్వర్తించకుండా మంత్రి మల్లారెడ్డి అడ్డుకున్నారని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అంతటితో ఊరుకోని ఐటి అధికారులు తాము మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై సాగించిన ఐటీ దాడుల్లో భాగంగా గుర్తించిన అంశాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సమగ్రంగా లేఖ రాశారు. ఐటీ దాడుల్లో భాగంగా మనీలాండరింగ్ జరిగినట్లుగా అనుమానం ఉందని, మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని ఐటీ అధికారులు రాసిన లేఖతో ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది ఏమో అన్న అనుమానం కలుగుతుంది.

మల్లారెడ్డి చేసిన ఓవరాక్షన్ మల్లారెడ్డి కొంపముంచే పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ అధికారులు తమ దాడులలో ఆదాయపు పన్ను ఎగవేత అంశాలు ఏవైనా ఉంటే గుర్తించి ఫైన్ విధిస్తారు. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది. కానీ మల్లారెడ్డి చేసిన హంగామా కారణంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగితే మల్లారెడ్డి సంస్థల్లోకి అక్రమ మార్గంలో వచ్చిన నగదుకు సంబంధించిన గుట్టు బయట పడే అవకాశం ఉంటుంది. మల్లారెడ్డి మొదటి నుంచి వివాదాస్పద నేతగా పేరుపొందారు.. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అందులో వెంచర్లు వేసి విక్రయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పైగా మల్లారెడ్డి విద్యాసంస్థలను ప్రభుత్వ భూములను ఆక్రమించి అందులో నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఆ మధ్య వర్షాలు వచ్చినప్పుడు మల్లారెడ్డి ఆసుపత్రి నీట మునిగింది. ఇందుకు కారణం ఆస్పత్రిని చెరువు శిఖం ప్రాంతాల్లో నిర్మించడమే. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ మధ్య ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించి ఆ నిర్వాహకుడికి మంత్రి స్వయంగా ఫోన్ చేసి బెదిరించడం అప్పట్లో కలకలం చెలరేగింది. అయితే ఇన్ని ఆరోపణలు ఉన్న మంత్రి మల్లారెడ్డి గుట్టుమట్లు మొత్తం కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు ఎలా తెలిసింది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తున్నది. అయితే ఆయనకు తెలిసిన వారే ఈ పని చేశారని సమాచారం. మొత్తమ్మీద మల్లా రెడ్డి మామూలోడు కాదు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా