Advertisement

Advertisement


Home > Politics - Telangana

‘మంత్రి’ రేసులో పోటీ తగ్గినట్టే.. ఎలాగంటే?!

‘మంత్రి’ రేసులో పోటీ తగ్గినట్టే.. ఎలాగంటే?!

రేవంత్ రెడ్డి కేబినెట్లోకి ప్రస్తుతం 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. మొత్తం 18 మంది మంత్రులకు తెలంగాణలో అవకాశం ఉండగా.. మరో ఏడుగురు రెండో విడతలో మంత్రులయ్యే అవకాశం ఉంది. అంతర్గత ప్రజాస్వామ్యం మితిమీరి ఉండే కాంగ్రెస్ వంటి పార్టీలో.. మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉండడం.. పదవులు ఇవ్వకపోతే కీలక నాయకులు అలకపూనడం వంటి వ్యవహారాలు చాలా మామూలు సంగతి. 

ఫలితాల తర్వాత.. పార్టీ తరఫున గెలిచిన 64 మంది కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే అని.. ఎవరైనా ఆ పదవి చేపట్టవచ్చునని దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించిన క్రమంలో.. 64 మంది కూడా మంత్రులుగా ఆశలు పెట్టుకునే వాళ్లే అని అనుకోవచ్చు. 

కానీ నిజం చెప్పాలంటే.. ఈ ఫలితాల తర్వాత.. రేవంత్ కేబినెట్ కోసం పోటీ చాలా తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే.. మంత్రి పదవులకు అర్హమైన సీనియారిటీ ఉన్న, పోటీలో ఉండగలరని భావించే పలువురు నాయకులు ఎన్నికల్లో ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, షబ్బీర్, మధుయాస్కీ గౌడ్, జగ్గారెడ్డి తదితరులు ఓడిపోయారు. జీవన్ రెడ్డి పార్టీలో ఎంతో సీనియర్ నాయకుడు.. పార్టీ గెలిస్తే ఆయన వ్యవసాయమంత్రి అవుతారనే ప్రచారం కూడా ముందుగానే జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా పదవిలోనే ఉన్నందున.. రెండో విడతలోనైనా మంత్రి పదవి పొందడానికి అభ్యంతరం ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు.

మధుయాస్కీ పరిస్థితి వేరు. ఆయన ఎల్బీనగర్ నుంచి పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు. గెలిస్తే ఆయన కూడా మంత్రి రేసులో ఉండేవారే. అలాగే జగ్గారెడ్డి కూడా. ఆయన సంగారెడ్డినుంచి పోటీచేసి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. తాను సీఎం అయ్యే అవకాశం కూడా ఉన్నదని చెప్పుకున్న జగ్గారెడ్డి ఎమ్మెల్యేగానే ఓడిపోయారు. షబ్బీర్ ఆలీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి వరించి ఉండేది. 

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్న లోటు కూడా మైనారిటీ వర్గానికి చెందిన ప్రాతినిధ్యం లేకపోవడమే. షబ్బీర్ ఆలీ గెలిచి ఉంటే ఆ లోటుండేది కాదు. ఇలా కీలక నాయకులు నలుగురు ఓడిపోవడంతో మంత్రి పదవులకు పోటీ కాస్త ఆటోమేటిగ్గా తగ్గినట్టు అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?