Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ రెడ్డి ఇక నామమాత్రమేనా?

రేవంత్ రెడ్డి ఇక నామమాత్రమేనా?

తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలు ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి వణుకు పుట్టిస్తున్నాయి. భయం కలిగిస్తున్నాయి. జుట్టు పీక్కునేలా చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయిన కొన్ని రోజులకే సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న మర్రి శశిధర్ రెడ్డి వెళ్ళిపోయాడు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ కోసం పనిచేయలేదు. బీజేపీలో చేరడానికి ఇంకో పదిమంది కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని కమలం పార్టీ నాయకులు చెబుతున్నారు. 

పార్టీ నుంచి వెళ్ళిపోతున్నవారంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే దోషిని చేస్తున్నారు. ఆయన మీద అనేక విమర్శలు చేస్తున్నారు. సీనియర్లుగా ఉన్న తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పార్టీలో చేరిన కొద్దీ కాలానికే పార్టీ  ప్రెసిడెంట్ గా చేశారని అసలు సిసలు కాంగ్రెస్ నాయకులు మొదటినుంచి మండిపడుతున్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. మొత్తానికి అసంతృప్తి మరింత పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఇక నుంచి నేరుగా తెలంగాణ వ్యవహారాలను ప్రియాంకా గాంధీ స్వయంగా చూసుకుంటారట. రేవంత్ రెడ్డి పార్టీని నడపడంలో విఫలమయ్యాడని అధిష్టానం భావిస్తోంది. జగ్గారెడ్డి వంటి నాయకులు మొదట్లో సానుకూలంగా ఉన్నా తరువాత అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. వర్కంగ్ ప్రెసిడెంట్‌నైన తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. కనీసం తమ జిల్లాకు వచ్చినప్పుడు కూడా సమాచారం ఇవ్వడం లేదని జగ్గా రెడ్డి ఫైరవడం ప్రారంభించారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న వ్యూహకర్త ఇస్తున్న సర్వేలు.. నివేదికలు.. రేవంత్ రెడ్డి తీసుకొచ్చి చేర్పిస్తున్న చేరికలు అన్నీ.. సీనియర్లకు నచ్చలేదు. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి.. మునుగోడు ఉపఎన్నికలను తీసుకురావడంతో పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్లంతా రేవంత్ రెడ్డినే గురి పెట్టి విమర్శలు చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మొదట్లో అందర్నీ కలుసుకొని  కలిసి పని చేద్దామన్న రేవంత్ తర్వాత వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే పని చేస్తున్నారని వారు ఆరోపించడం ప్రారంభించారు. ఈ విషయంలో రేవంత్ పై హైకమాండ్ వద్ద మైనస్ మార్కులే పడ్డాయి. 

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇప్పుడు ఊపు వచ్చింది. ప్రధాన పోటీదారుగా మారామని గట్టి నమ్మకంతో ఉంది. కానీ ఆ పార్టీకి కింది స్థాయిలో క్యాడర్ లేదు. నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి  బలమైన నాయకులు లేరు. అందుకే చేరికలపై దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ నుంచి నేతల్ని చేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. దీంతో బీజేపీ.. కాంగ్రెస్ నేతల్నే ఆకర్షించాలని నిర్ణయించుకుంది.  

బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చాలా ఊపు ఉందని, కాంగ్రెస్ నాయకులు వచ్చి చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని కీలక నేతలకు ఆఫర్లిస్తున్నారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు ఊగిసలాటలో ఉన్నారు . వీరిలో ఎక్కువ మంది సీనియర్లే.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంతకూ గాడిన పడకపోతూండటం... పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూండటంతో  కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. తెలంగాణ బాధ్యతలను ఇక స్వయంగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ సారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పై ఎక్కువ నమ్మకం ఉంచి.. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. అయితే రేవంత్ ఎంత ప్రయత్నించినా సీనియర్లు ఆయనను అంగీకరించలేకపోతున్నారు. దీంతో  కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ లీడ్ తీసుకుంటున్నారని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇక నామమాత్రంగానే ఉంటారా? 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా