Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఇదేం లొల్లి: ముంపు గ్రామాల చుట్టూ టీ--రాజకీయం!

ఇదేం లొల్లి: ముంపు గ్రామాల చుట్టూ టీ--రాజకీయం!

ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత! ఎక్కడో ఏదో జరిగితే దాని ఎఫెక్టు మరెక్కడో పడడం గురించి మన పెద్దలు ఈ సామెత చెబుతారు. ప్రస్తుతం.. తెలంగాణ నుంచి విభజన తర్వాత.. ఏపీ పరిధిలోకి వచ్చిన ఏడు మండలాల వ్యవహారం.. ఇదే మాదిరిగా ఉంది. తెలంగాణలో పార్టీలు పరస్పరం కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి.. ఈ ముంపు గ్రామాలను ఒక పావుగా వాడుకుంటున్నాయి. టీ--రాజకీయం దారితప్పి సాగుతోంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. రాష్ట్రాన్ని విభజించినప్పుడు.. అనాథలాగా విడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టును ఒక వరంగా ప్రకటించింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు అనేది.. రాష్ట్రం విడిపోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేది ఎంత మాత్రమూ కాదు గానీ.. అంతకు మించి ఏపీకి దక్కినవి కూడా ఏమీ లేవు. ఆ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికరి జీవదాయని అని అందరూ నమ్మారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే.. ముంపు గ్రామాల పరంగా ఏపీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి తెలంగాణ పరిధిలోని ఏడు మండలాలను ఏపీలో విలీనంచేస్తూ విభజనచట్టంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఏడు మండలాల విలీన ప్రక్రియ కాంగ్రెస్ హయాంలో జరగకపోగా.. ఆ తర్వాత వచ్చిన మోడీ సర్కారు తంతు పూర్తి చేసింది. 

కాకపోతే.. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాగా.. కేంద్రమే నిర్మించాల్సిన దానిని.. వారి నిధులతో నేను నిర్మిస్తా అంటూ చంద్రబాబు పూనుకుని, ముందడుగు పడకుండా సర్వనాశనం చేసేశారు. ఇటీవలి వరదల నేపథ్యంలో భద్రాచలం ప్రాంతంలో కొన్ని ఊర్లు మునకకు గురికావడంతో.. విలీన మండలాలు.. పోలవరం ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అన్యాయంగా తెలంగాణ మండలాలను ఏపీలో కలిపారని తెరాస వారు బిజెపిని టార్గెట్ చేయడానికి ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. 

అదే సమయంలో.. బిజెపి నేతలు కూడా.. ముంపు మండలాలనే తమ రాజకీయ అస్త్రంగా వాడడం విశేషం. ఈసారి తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. ముంపు మండలాలను తిరిగి తెలంగాణలోకి తెస్తాం అని బిజెపి నేత డికె అరుణ అంటున్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి.. ముంపు చుట్టూ కుటిల రాజకీయం చేయడానికి మాత్రమే. ఎందుకంటే.. వారు అనుకుంటే ఇప్పుడే ఆ మండలాలను తిరిగి తెలంగాణలకి తేగలరు. అది కేంద్రం చేయాల్సిన పనేతప్ప.. రాష్ట్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం చేసేది కాదు!

ముంపు మండలాలను రాజకీయంగా తెరాస–బిజెపి రెండూ వాడుకుంటున్నాయి. ఎవరెలా వాడుకున్న.. వారి మాటలు ఏపీకి ప్రమాద ఘంటికలు! ముంపు మండలాల, గ్రామాల నెపం చూపి.. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రభస చేసే ప్రమాదం మెండుగా కనిపిస్తోంది. తెలంగాణ పార్టీలు తమ రాజకీయం కోసం వాడుకుంటున్న మాటలు.. ఏపీకి అంతో ఇంతో వరంగా మారుతుందని అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా సిద్ధించే ప్రయోజనాలకే గండికొట్టే ప్రమాదం కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?