Advertisement

Advertisement


Home > Politics - Telangana

రెడ్ల ఓట్లు 7 వేలే అయినా, వేడంతా వాళ్ల‌దే!

రెడ్ల ఓట్లు 7 వేలే అయినా, వేడంతా వాళ్ల‌దే!

1967 నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేల జాబితాను ప‌రిశీలిస్తే.. ప్ర‌ధానంగా రెడ్ల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు! సీపీఐ త‌ర‌ఫున ప‌ల్లా వెంక‌ట్ రెడ్డి ఒక‌సారి నెగ్గారు. కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పార్టీల పొత్తులో భాగంగా 2004లో ఆయ‌న ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇక 2014లో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి టీఆర్ఎస్ త‌ర‌ఫున నెగ్గారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రఫున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విజ‌యం సాధించారు.

ప‌న్నెండు ప‌ర్యాయాల‌కు గానూ ఎనిమిది సార్లు రెడ్లు ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. నాలుగు ప‌ర్యాయాలు మాత్రం వేరే వారికి అవ‌కాశం దక్కింది. వారిలో ఒకే అభ్య‌ర్థి ఉజ్జిని నారాయ‌ణ రావు వ‌ర‌స‌గా మూడు ప‌ర్యాయాలు సీపీఐ త‌ర‌ఫున నెగ్గారు. 

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీల త‌ర‌ఫున పోటీకి దిగింది ముగ్గురూ రెడ్లే. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి, గంగిడి మ‌నోహ‌ర్ రెడ్డిలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల త‌ర‌ఫు నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నిక‌ల్లో కూడా ఈ సామాజిక‌వ‌ర్గ అభ్య‌ర్థులే బ‌రిలోకి దిగారు. ఇండిపెండెంట్ గా పాల్వాయి కూతురు పోటీ చేశారు. 2009లో ఇత‌ర పార్టీల‌కు తోడు ప్రజారాజ్యం పార్టీ త‌ర‌ఫున కూడా ఒక రెడ్డే పోటీ చేశారు. 

గ‌త‌మే కాదు.. వ‌ర్త‌మానంలో కూడా అభ్య‌ర్థిత్వాల విష‌యంలో రెడ్ల అభ్య‌ర్థులే తెర‌పైకి నిలుస్తున్నారు. రాజ‌గోపాల్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డి పేర్లు ఖ‌రారేనేమో! వీరికి తోడు.. కాంగ్రెస్ త‌ర‌ఫున కూడా రెడ్డే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మ‌రి ఇంత చ‌రిత్ర‌ను చూస్తే.. మునుగోడ చ‌రిత్ర అంతా ఇలా రెడ్డి అభ్య‌ర్థులు, ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. అలాగ‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గం అంతా రెడ్డి జ‌నాధిప‌త్య‌మో ఉంటుందేమో అనుకోవ‌చ్చు. అయితే.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం రెడ్డి జ‌న‌సంఖ్య బాగా త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌లా అంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్ల ఓట్ల శాతం ఐదు మాత్ర‌మే! లెక్క ప్ర‌కారం చూస్తే.. ఏడు వేల ఓట్లు తేల‌తాయి.

వారిలో కూడా నియోజ‌క‌వ‌ర్గ‌ప‌రిధిలో ఉన్న వారి శాతం మ‌రింత త‌క్కువ! చాలా మంది హైద‌రాబాద్ లో సెటిల‌యిన బాప‌తు. ఈ ర‌కంగా చూస్తే..  పోల్ అయ్యే ఓట్లు చాలా ప‌రిమితం అని స్ప‌ష్టం అవుతోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా మునుగోడు బై పోల్ అంటే, రెడ్డి అభ్య‌ర్థులే చ‌ర్చ‌లో నిలుస్తున్నారు. గౌడ్లు, ముదిరాజ్ లు, యాద‌వులు, మాదిగ‌ల ఓట్ల శాతం ప్ర‌ధానంగా ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?