Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆ ఇద్దరూ ఢిల్లీకి.. రేవంత్ కు లైన్ క్లియర్!

ఆ ఇద్దరూ ఢిల్లీకి.. రేవంత్ కు లైన్ క్లియర్!

ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. సీఎల్పీ భేటీ అనేది లాంఛనం అని తొలుత అంతా అనుకున్నారు. నిజానికి ఫలితాలు వెలువడిన రోజే రాత్రికి సీఎల్పీ నిర్వహించి.. నేతను తేలుస్తారని ప్రచారం జరిగింది. 

కొందరు ఎమ్మెల్యేలు ఆ రాత్రికి హైదరాబాదు చేరుకోలేకపోవడం వల్ల.. సోమవారం ఉదయం భేటీ ఏర్పాటు అయింది. భేటీలో అంతా రెండు మూడుగంటల వ్యవధిలో ఢిల్లీనుంచి అప్రూవల్ సహా తేలిపోతుందని ప్రచారం జరిగింది. కానీ ఒకరోజు పూర్తిగా గడచిపోయినా ఇంకా తేలలేదు. వ్యవహారం ఢిల్లీకి చేరింది. ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా సీఎం పదవిని ఆశిస్తున్న ఇద్దరు కీలక నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఢిల్లీకి అధిష్ఠానం పిలిపించడంతో వ్యవహారం రసకందాయంలో పడినట్టు అయింది.

సీఎం ఎవరో నిర్ణయించే అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఢిల్లీనుంచి అనుకున్న వ్యవధిలో స్పందన రాకపోవడంతో.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఇద్దరూ కలిసి సోమవారం రాత్రికి ఢిల్లీ వెళ్లారు. 

ఆల్రెడీ, డికె శివకుమార్.. రాష్ట్రంలో పరిస్థితుల గురించి, మెజారటీ ఎమ్మెల్యేల అభిప్రాయం గురించి, సమీకరణాల గురించి మల్లికార్జున ఖర్గేకు ఫోనులో విపులంగా తెలియజేసే ఉన్నారు. అయినా పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లారు. వారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు ఖర్గేతో సమావేశం అవుతారు.

అయితే తాజా పరిణామం ఏంటంటే.. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కూడా ఢిల్లీనుంచి పిలుపు వచ్చింది. మల్లికార్జున ఖర్గే వారితో కూడా సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడానికి ఆటంకంగా, కీలకంగా పోటీపడుతున్న నాయకులు వీరే కావడం గమనార్హం. ఈ ఇద్దరినీ ఢిల్లీ పిలిపించడం అంటే.. వారిని బుజ్జగించడానికి మాత్రమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

రేవంత్ ను సీఎం చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుకగల ఔచిత్యాన్ని ఈ ఇద్దరు నాయకులకు వివరించి, ఈ ఇద్దరికీ పార్టీ కల్పించగల ఇతర అవకాశాల గురించి తెలియజెప్పి మొత్తానికి వారిలో ఎలాంటి అసంతృప్తి రేగకుండా సద్దుమణిగేలా చేయడానికి మాత్రమే ఢిల్లీ పిలిపించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సాయంత్రానికి అంతా తేలిపోతుందని, ఈ ఇద్దరినీ బుజ్జగించిన తర్వాత.. రేవంత్ కు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?