Advertisement

Advertisement


Home > Politics - Telangana

సంతోష్ సాక్షిగా పరువు పోవడం గ్యారంటీ!

సంతోష్ సాక్షిగా పరువు పోవడం గ్యారంటీ!

తప్పు చేశారా? లేదా? పాపం పూర్తిగా అమాయకులైన వ్యక్తులు.. ఒక ఉచ్చులో ఇరుక్కుపోయినందువల్ల విలవిల్లాడుతున్నారా? ఇవన్నీ కూడా తరవాతి సంగతులు.. తెరాస ఎమ్మెల్యేలకు బిజెపి తరఫు నుంచి ఎర వేశారనే వివాదంలో.. కమలం పార్టీ పరువు పోవడం మాత్రం గ్యారంటీ అనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది. బిజెపి అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలు, దూకుడు, వారి వైఖరి ఇవన్నీ కూడా.. వారి మీద అనుమానాలు బలపడే విధంగానే ఉన్నాయి. 

నేరం జరిగిందా లేదా? శిక్ష పడుతుందా లేదా? అనేది పెద్ద ప్రయారిటీ కానే కాదు. ఎందుకంటే.. చట్టంలో అనేక చిన్నచిన్న అంశాలు ఉంటాయి. వాటిని పట్టుకుని నేరం చేసిన వాళ్లు కూడా తప్పించుకుంటుండడం కద్దు. అలాంటిది.. వీరిని తప్పించగల లూప్ హోల్స్ చట్టంలో ఉండకపోవచు. కాబట్టి నేరం– శిక్ష సంగతి ఎలా ఉన్నా.. బిజెపికి పరువు మాత్రం పోతోంది.

ఎందుకంటే.. సరిగ్గా బిజెపికి చెందిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. సిట్ ఆధ్వర్యంలో విచారిస్తున్న సమయంలోనే… బిజెపిలో చాలా పెద్ద తలగా భావించే బిఎల్ సంతోష్ కు పోలీసులు సమన్లు కూడా జారీచేసిన సమయంలోనే. తెరాసకు చెందిన మంత్రి మల్లారెడ్డి ఇంటిమీద ఐటీదాడులు జరగడం.. అయిదు కోట్ల రూపాయలు, అనేక పత్రాలు స్వాధీనం చేసుకోవడం ఇలాంటివన్నీ ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? రాష్ట్ర సర్కారు.. తమ పోలీసులతో బిఎల్ సంతోష్ స్థాయి వారికి నోటీసులు ఇప్పిస్తే, విచారణకు రాకపోతే గనక అరెస్టు చేస్తాం అని ఫత్వా కూడా పంపితే.. దానికి జవాబుగా మంత్రిమల్లారెడ్డి మీద ఐటీదాడులు జరిగాయా? అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం.

ఎమ్మెల్యేలకు ఎర అనే వ్యవహారంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదనే అనుకుందాం. మరి పోలీసులు విచారణకు రావాలని నోటీసు పంపినప్పుడు బిఎల్ సంతోష్ ఎందుకు నిరాకరించాలి. దేశంలోనే అతిపెద్దపార్టీకి చెందిన పెద్ద వ్యక్తి.. చట్టాన్ని గౌరవించెపోతే ఎలాగ? ఆయన తనను అరెస్టు చేస్తారని భయపడుతున్నారా? అనే అభిప్రాయం కూడా ప్రజలకు కలుగుతోంది. 

దానికి తోడు.. అడ్డంగా ఫామ్ హౌస్ లో దొరికిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసును కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే సీబీఐకు అప్పగించాలని.. బిజెపి నాయకులు హైకోర్టులో పోరాడుతుండడం కూడా.. వారి పరువు పోవడానికి మరో కారణం. అసలే సీబీఐ అనేది బిజెపి కనుసన్నల్లో పనిచేస్తుందని ప్రత్యర్థులు అందరూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు బిజెపి మీద నిందలున్న సమయంలో.. ఈ డిమాండ్ ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. 

సంతోష్ తప్పు లేనప్పుడు విచారణకు వస్తే పోయేదేముందని ఒకవైపు హైకోర్టు కూడా ఆశ్చర్యం వెలిబుచ్చడం విశేషం. మరోవైపు.. సంతోష్ కు నోటీసులు ఇచ్చినట్టుగా ప్రచారక్ ల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బండి సంజయ్ హెచ్చరించడం ఇంకా వింత. ఒక పార్టీలో ప్రచారక్ లు గనుక.. వారికి ఎలాంటి చట్టాలూ వర్తించవా అని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంత స్పష్టంగా వీడియో కెమెరాల సాక్షిగా దొరికిన తర్వాత.. ఆ నిందితులు ముగ్గురూ తమ మీద జరుగుతున్న సిట్ విచారణను నిలిపివేయాలని కోరుతూ కోర్టులో మరో పిటిషన్ నడుపుతున్నారు. విచారణను నిలిపేయాలనడానికి ఏం కారణాలు చూపుతారో తెలియదు గానీ.. ఈ ముగ్గురు నిందితుల దగ్గరినుంచి, కేసులు నడుపుతున్న బిజెపి నేతలు, విచారణ ఎగ్గొడుతున్న నేతలు అందరూ కలిసి కమలం పార్టీ కమలం పార్టీ పరువు తీసేయడం గ్యారంటీ! తెలంగాణలో మాత్రమేకాకుండా.. ఇతరప్రాంతాల్లో కూడా పరువు పోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?