Advertisement

Advertisement


Home > Politics - Telangana

పంచ్ డైలాగ్‌లు స‌రే....జ‌నం నుంచి ఆద‌ర‌ణ‌?

పంచ్ డైలాగ్‌లు స‌రే....జ‌నం నుంచి ఆద‌ర‌ణ‌?

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల వైఎస్సార్‌టీపీని స్థాపించారు. కానీ తెలంగాణ‌లో ఊహించినంత‌గా ష‌ర్మిల పార్టీకి ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్న లోపం లేకుండా శ్ర‌మిస్తున్నారు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయినా అటు వైపు నుంచి ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై క‌నీస స్పంద‌న కూడా లేదు.

ష‌ర్మిల‌ను విస్మ‌రించ‌డం ద్వారా ఆమె పార్టీని గుర్తించ‌డానికి నిరాక‌రించిన‌ట్టుగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల తెలంగాణ‌లో పాద‌యాత్రం చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్‌పై ఆకాశ‌మే హ‌ద్దుగా ష‌ర్మిల చెల‌రేగిపోతున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌నీస ప్ర‌చారానికి నోచుకోవ‌డం లేదు. ష‌ర్మిల పంచ్ డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ, జ‌నం నుంచి పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డం వైఎస్సార్‌టీపీ శ్రేణుల్ని నిరాశ‌కు గురి చేస్తోంది.

ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగుల కోసం ష‌ర్మిల దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ దమ్మ‌పేట మండ‌లం అప్పారావుపేట‌లో నిరుద్యోగ నిరాహార‌దీక్ష‌లో ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. పనిలో ప‌నిగా ప్ర‌తిప‌క్షాల‌కు కూడా చుర‌క‌లు అంటించారు.

ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉండాలని ష‌ర్మిల ప్రశ్నించారు. ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగమైతే, నిరుద్యోగానికి కారణం కేసీఆర్ అని సెటైర్ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటార‌ని నిల‌దీశారు. చదువుకున్న పిల్లలు గాలికి తిరగాలి, చేతకాని ముఖ్యమంత్రి బోగాలు అనుభవించాల‌ని ఎద్దేవా చేశారు. పెద్ద పెద్ద గడీలు కట్టుకోవాలి, చదువుకున్న బిడ్డలు నాశనం అవ్వాలి అని పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు.  

కేసీఆర్‌ని రెండు సార్లు గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. ఏరు దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుగా ఉంద‌ని తెలంగాణ సీఎం తీరును త‌ప్పు ప‌ట్టారు. త‌న‌ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్‌కు నాలుగు నెలలు టైం పట్టదని, ఇదే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం ఏళ్లకు ఏళ్లు పడుతుందా అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.  

అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారని విమ‌ర్శించారు. గుడ్డి గుర్రాలకు పల్లు తోమినట్లుగా ప్రతిపక్షాల పరిస్థితి ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ప్ర‌తిప‌క్షాల పంథాను రాజకీయ వ్యభిచారంతో ష‌ర్మిల పోల్చ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?