Advertisement

Advertisement


Home > Politics - Telangana

షర్మిలా.. నోరు జారనేల.. మాట దిద్దనేల..?

షర్మిలా.. నోరు జారనేల.. మాట దిద్దనేల..?

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అంటారు పెద్దలు. కానీ వర్తమాన రాజకీయాలకు ఆ సామెతను వర్తించి చూసుకుంటే.. నోరు జారనేల.. మాట దిద్దనేల అని మార్చుకుని చదువుకోవాలేమో..! రాజకీయ నాయకులు నోరుజారి విరుద్ధమైన మాటలు మాట్లాడి.. ఆ తర్వాత వాటిని దిద్దుకోవడం కోసం.. నానా పాట్లు పడడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. 

తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును కలగంటున్న వైఎస్ షర్మిల కూడా అలాంటి పొరబాటు చేశారు. ‘ప్రత్యర్థి పార్టీ గుర్తుకే ఓట్లు వేయండి’ అని నోరు జారి చెప్పే కామెడీ పొరబాటు కాదిది. చాలా సీరియస్ పొరబాటే. ప్రత్యర్థులు ఆమెను ఓ ఆటాడుకోవడానికి అవకాశం ఇచ్చే పొరబాటే. నోరు జారిన తర్వాత.. ఎంత సమయానికి ఆమె ఆ పొరబాటును గుర్తించారో ఏమో గానీ.. పార్టీ పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేసి మరీ.. దానిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే జరగవలసిన కామెడీ జరిగిపోయింది కదా.. ట్రోలింగ్ లు కూడా మొదలైపోయి ఉంటాయి. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. హైదరాబాదులో లోటస్ పాండ్ లోని తన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. సహజంగా మీడియా ముందు ఎప్పుడు మాట్లాడినా సరే.. సూటిగా కేసీఆర్ మీదే తీవ్రమైన విమర్శలు కురిపించే షర్మిల ఈసారి కూడా అదే పనిచేశారు. ఏపీలో కూడా కీలకంగా అనేక ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకుంటున్న మేఘా కృష్ణారెడ్డి మీదకు ఈదఫా ఆమె ఆవేశం మళ్లింది. మేఘా కృష్ణారెడ్డితో లాలూచీ పడ్డారంటూ కేసీఆర్ కు ముడిపెట్టి విమర్శలు చేయడానికి షర్మిల ఉత్సాహపడ్డారు. 

ఇంతవరకు అంతా బాగానే ఉంది. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ లాగా ఒకే కాంట్రాక్టరుకే అన్ని ప్రాజెక్టులూ ఇవ్వలేదు.. ఒక్కరి దగ్గరే కమిషన్లు తీసుకోలేదు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరికే పనులన్నీ అప్పగించి.. ఒక్కరి దగ్గరే కమిషన్లు తీసుకుంటూ ఉంటే.. తన తండ్రి వైఎస్సార్ అనేక మంది కాంట్రాక్టర్ల దగ్గరినుంచి కమిషన్లు తీసుకునే వారని- అర్థం వచ్చేలా షర్మిల మాటలు ఉన్నాయి. విలేకర్ల సమావేశంలో విన్నవారు నివ్వెరపోయారు. 

ఏ వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రజల్లో మిగిలి ఉండగల ఆదరణను, ప్రేమను రాజకీయంగా తనకు లబ్ధిగా మలచుకోవాలనే ఉద్దేశంతో షర్మిల రాజకీయ ప్రస్థానం తెలంగాణ నేల మీద ప్రారంభించారో.. అదే వైఎస్సార్ ను అపకీర్తి పాల్జేసేలా ఆయన కూతురే మాట్లాడితే విన్నవారు విస్తుపోకుండా ఎలా ఉంటారు? ఈ తప్పును చాలా సేపటి తర్వాత తెలుసుకున్న షర్మిల దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేశారు. ‘‘వైఎస్ఆర్ ఎవ్వరి వద్దా కమిసన్లు తీసుకోలేదు’’ అని చెప్పబోయి.. షర్మిల పొరబాటుగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఆమె పీఆర్వో మీడియాకు ఒక వివరణ కూడా విడుదల చేశారు. 

సాధారణంగా ఇలాంటి నోరుజారే పొరబాట్లు అనేకం జరుగుతుంటాయి. పార్టీలు ఫిరాయించిన తర్వాత.. తాము వదలిపెట్టి వచ్చిన పార్టీకి జై కొట్టే నాయకులు, ఆ గుర్తుకే ఓటు వేయమనే వారు.. మనకు అనేక మంది తారసపడుతుంటారు. అవన్నీ రాజకీయంగా చాలా కామెడీ సృష్టిస్తుంటాయి. కానీ.. షర్మిల మాటలు అలాంటి కామెడీవి కాదు. ప్రత్యర్థులు సీరియస్ విమర్శలకు అనుకూలంగా మలచుకోదగినవి.

సాధారణంగా ఇలాంటి పొరబాట్లు జరిగినప్పుడు.. నాయకులు వెంటనే దాన్ని గమనిస్తారు. ఆ తర్వాతి వాక్యాల్లోనే నిర్మొహమాటంగా దాన్ని దిద్దేసుకుంటారు. తమ అసలు భావాన్ని మరింత తీవ్రంగా వ్యక్తీకరిస్తారు. ఇదంతా తామేం మాట్లాడుతున్నాం అనేదాని మీద పూర్తి స్పృహతో ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది. రాజకీయ ప్రసంగాల్లో ఇంకొంచెం రాటు తేలితే షర్మిల ఆ దశకు తప్పకుండా చేరుకుంటారేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?