Advertisement

Advertisement


Home > Politics - Telangana

భ్రమల్లో బతుకుతున్న టీడీపీ అధినేత

భ్రమల్లో బతుకుతున్న టీడీపీ అధినేత

కొంతమంది రాజకీయ నాయకులు కావొచ్చు, పార్టీల అధినేతలు కావొచ్చు భ్రమల్లో బతుకుతుంటారు. మా తాతలు నేతులు తాగారు ...మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉంటుంది వీరి ధోరణి. అపారమైన రాజకీయ అనుభవం ఉన్నా వాస్తవాలను గ్రహించరు. ఇలాంటి వారిలో టీడీపీ అధినేత చద్రబాబు ఒకరు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ పని అయిపొయింది.

రాష్ట్ర విభజన జరిగిన 2014 నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పటికే బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ తెలంగాణలో దాదాపు పదిహేను స్థానాలు దక్కించుకుంది.

హైదారాబాద్ సహా తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులు టీడీపీకి ఓట్లు వేయబట్టి ఆ మాత్రం సీట్లు వచ్చాయి. ఏపీలో బాబు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తరువాత తెలంగాణలో టీడీపీ క్రమంగా క్షీణ దశకు చేరుకుంది.

ఈ తరువాత తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులు కూడా కేసీఆర్ వైపు టర్న్ అయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అనేక రకాల ఎన్నికలు జరిగాయి. కానీ ఏ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించలేదు. ఒకప్పుడు సమైక్యవాదానికి కట్టుబడి, దానినే బలంగా వినిపించిన తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది క్రమంగా  గులాబీ దళంలోకి చేరిపోయి తెలంగాణవాదులుగా మారిపోయి, కేసీఆర్ భజనపరులుగా మారిపోయి మంత్రి పదవులు అందుకున్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం టీడీపీ లెజిస్లేచర్ పార్టీనే గులాబీ పార్టీలో కలిపేశాడు. మిగిలిన ఇద్దరో ముగ్గురో నెమ్మదిగా గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ విధంగా టీడీపీ తెలంగాణలో భూస్థాపితమైంది. ఆ తరువాత చాలా ఎన్నికల్లో టీడీపీ పోటీయే చేయలేదు కూడా. టీడీపీ క్యాడర్ ఊళ్లకు ఊళ్లే టీఆర్ఎస్ గా రూపాంతరం చెందినా చంద్రబాబు వాస్తవం గుర్తించడంలేదు. 

పోయింది నేతలు మాత్రమేనని, వాళ్లను తయారు చేసిన కార్యకర్తలు ఇప్పటికీ తెలుగుదేశాన్నే నమ్ముకొని ఉన్నారని అధినేత చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా అధికార టీఆర్ఎస్ పై అలుపెరుగని పోరాటం చేద్దామంటూ టీటీడీపీ నేతలకు ఆయన ధైర్యం నూరిపోస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న చంద్రబాబు ‘బాదుడే బాదుడు’పేరుతో జిల్లాల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో విడతలవారీగా జిల్లాల యాత్రలు తలపెట్టిన చంద్రబాబు ఏమాత్రం గ్యాప్ దొరికినా హైదరాబాద్ లో వాలిపోయి టీటీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. గత 20 రోజుల వ్యవధిలో రెండోసారి చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో బాబు సమీక్ష జరిపారు. ఇంకా చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్ ను కాపాడుకోవాలని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించాలని నేతలకు చెప్పారు. 

అధికార పార్టీ పతనావస్థపైనా మాట్లాడారు.

అధికారంలో ఉన్న పార్టీలు డబ్బులు ఉంటే అంతా చేసేయొచ్చనే భ్రమలో ఉంటారని, నిజానికి డబ్బులుంటేనే రాజకీయం సాగుతుందనుకోవడం తెలివితక్కువ తనమని, ప్రజల్లో గనుక ఒక్కసారి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఎంత డబ్బులున్నా పనిచేయవని చంద్రబాబు అన్నారు. 

ఏపీని ఎన్నో రకాలుగా అభివృద్ది చేసినా ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం టీడీపీనే కావాలని చంద్రబాబు  నాయకులకు  చెప్పారు.

ఎన్నికల్లో గెలుస్తాయో లేదో తెలియని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ముమ్మరంగా పోరాటం చేస్తున్నాయి. బీజేపీకి కొన్ని అసెంబ్లీ స్థానాలను, పార్లమెంటు స్థానాలను, టీఆర్ఎస్ ను ఓడగొట్టిన చరిత్ర ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీకి ఏం చరిత్ర ఉంది? టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలూ చేయడంలేదు. 

ఇలాంటి పార్టీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? చంద్రబాబు ఏపీలో తన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే మంచిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?