Advertisement

Advertisement


Home > Politics - Telangana

తెలంగాణ మంత్రులందరూ శెభాష్!

తెలంగాణ మంత్రులందరూ శెభాష్!

రేవంత్ రెడ్డి సారథిగా.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ప్రమాణస్వీకారం అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టారు. అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. ఒకే చోట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుండగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఎల్బీ స్టేడియంలో  ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. రేవంత్ రెడ్డి బృందంగా 11 మంది మంత్రులు ఇవాళ తొలివిడతగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఒక్క విషయంలో మాత్రం రేవంత్ టీం మొత్తాన్ని శెభాష్ అని తీరాలి.

అదేంటంటే.. అందరూ.. పదవీ ప్రమాణాన్ని తప్పులు లేకుండా స్పష్టంగా చదివారు. తెలుగు భాషా ప్రియులకు ఇది సంతోషకరమైన కబురే.

రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణాలు చేశారు. కులాల తూకం బాగా పాటించినట్టే. ఎస్సీ ఎస్టీ (మాల మాదిగ), బీసీ (గౌడ, పద్మశాలి), కమ్మ, బ్రాహ్మణ, వెలమ కులాల నుంచి ఒక్కొక్కరు ఉండగా రెడ్డి వర్గం నుంచి నలుగురు ఉన్నారు.

ఈ 12 మందిలో దామోదర రాజనర్సింహ మాత్రమే ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. మిగిలిన 11 మంది తెలుగులోనే ప్రమాణాన్ని చదివారు. అందరూ చాలా స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణ పత్రాన్ని చదవడం విశేషం. ఒకరిద్దరు మాత్రం ‘సార్వభౌమాధికారాన్ని’ అనే పదం చదవడంలో చాలా స్వల్పంగా తడబడ్డారు. ‘అంతఃకరణ శుద్ధితో’ అనే పదాన్ని అందరూ స్పష్టంగానే చెప్పారు. ఈ పన్నెండు మందిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క మాత్రం ‘పవిత్ర హృదయంతో’ ప్రమాణం చేయగా మిగిలిన అందరూ కూడా.. ‘దైవ సాక్షిగా’ ప్రమాణం చేశారు.

రేవంత్ రెడ్డిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్న సమయంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఒకసారి తడబడి ‘రవీ..’ అని పలకబోయి అంతలోనే సర్దుకుని ‘రేవంత్ రెడ్డి’ అనడం తమాషా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?