Advertisement

Advertisement


Home > Politics - Telangana

గవర్నర్ తన పీకమీద కాలేసుకుని తనే తొక్కేసుకోవాలా?

గవర్నర్ తన పీకమీద కాలేసుకుని తనే తొక్కేసుకోవాలా?

ఏదో సినిమాలో ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది. ‘అరేయ్ నీ పీక మీద కాలేసుకుని, నువ్వే తొక్కేసుకోరా..’ అంటూ శిక్ష విధిస్తారు. ‘నా పీక మీద కాలేసుకుని, నేనే తొక్కేసుకోవాలా.?’ అంటూ విస్తుపోవడం సదరు కమెడియన్ వంతు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అలాంటి పరిణామమే కనిపిస్తోంది. తెలంగాణ గవర్నరు తమిళిసై తో సున్నంపెట్టుకుని.. విభేదాలను రోజురోజుకు రాజేసుకుంటున్న గులాబీ సర్కారు.. తాజాగా ఆమె ఛాన్సలర్ పదవికే ఎసరు పెట్టింది. 

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కూడా గవర్నరు అనుమతితో కాకుండా.. స్పీకరు అనుమతితోనే ఈసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత సమావేశాలను కూడా ఇదే తరహాలో నిర్వహించారు. గవర్నరును పూర్తిగా పక్కన పెడుతూ తెలంగాణ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఆ సమావేశాల్లో ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో జీఎస్టీకి సంబంధించినది తప్ప మిగిలినవి ఆమోదించకుండా ఆపేశారు. గవర్నరు వ్యవహార సరళిని కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కేసీఆర్ సర్కారు అనుకుంటున్నట్లు సమాచారం. 

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఈడీ, సీబీఐ దాడులు లాంటి అన్ని వ్యవహారాలను చర్చిస్తారు. వీటికి తోడు కేసీఆర్ సర్కారు ఇంకో బ్రహ్మాస్త్రాన్ని కూడా సిద్ధం చేసింది. విశ్వవిద్యాలయాల చాన్సలర్ గా గవర్నరును తొలగిస్తూ బిల్లను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనిని సభ ఆమోదించి గవర్నరు ముద్ర కోసం పంపుతారు. ఈ బిల్లుసభ ఆమోదం పొందినా గవర్నరు ఆమోదించడం జరగదనే సంగతి వారికి కూడా తెలుసు. కానీ.. ఆ రకంగా గవర్నరు వ్యవహార సరళిని మరింతగా రచ్చరచ్చ చేయడానికే ఇలా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

అందుకే ఈ బిల్లును గమనిస్తే.. ‘‘నీ పీక మీదే నువ్వే కాలేసుకుని తొక్కేసుకో..’’ అని గవర్నరుకు సూచిస్తున్నట్టుగా ఉన్నదనే సెటైర్లు వినిపిస్తున్నాయి. తమిళిసై అచ్చంగా రాజకీయ నాయకురాలి మాదిరిగానే.. గులాబీదళంతో తలపడుతున్నారు. ఈ బిల్లు కూడా వచ్చిందంటే మరోమారు ఆమె మీడియా ముందుకు వస్తారు. కేసీఆర్ సర్కారుకు గవర్నర్ తో చికాకులు మరికొన్ని కొత్తరూపాలు సంతరించుకుని కొనసాగుతాయి. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరో వైపు.. అసలు గవర్నర్ల వ్యవస్థనే తొలగించాలని వామపక్షాలు తమ డిమాండ్లు వినిపిస్తుండడం మరో ఎత్తు. కేసీఆర్ మనసులో మాటనే.. లెఫ్ట్ పార్టీలు బయటకు వినిపిస్తున్నాయా? అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?