Advertisement

Advertisement


Home > Politics - Telangana

నేపాల్ ప‌బ్ -రాహుల్ దేశ ర‌హ‌స్యాలు

నేపాల్ ప‌బ్ -రాహుల్ దేశ ర‌హ‌స్యాలు

పాత సినిమాల్లో ఒక సైంటిస్ట్ వుంటాడు. దేశానికి ఉప‌యోగ‌ప‌డే ఏదో క‌నుక్కుంటాడు. ల్యాబ్‌లో గాజుపాత్ర‌లో బుడ‌గ‌లు, పొగ‌లు వ‌స్తూ వుండ‌గా పిల్లి గ‌డ్డం లాక్కుంటూ స‌క్సెస్ అని అరుస్తాడు. ఈ లోగా చెక్క పీపాల మ‌ధ్య కూచున్న విల‌న్‌కి ఈ విషయం తెలుస్తుంది. సైంటిస్ట్‌ను కిడ్నాప్ చేస్తాడు. అయితే అప్ప‌టికే ఫార్ములాని సైంటిస్ట్ దాచేసి వుంటాడు. ఒక‌వేళ దొరికినా మ‌న చెక్క పీపాల విల‌న్ దాన్నేం చేసుకుంటాడు. ఫార్ములా చ‌దివి త‌యారు చేసేస్తాడా? లెక్క‌ల పుస్తకం చూస్తే మ‌న‌కి లెక్క‌లు వ‌చ్చేస్తాయా?

టీఆర్ఎస్‌లో బాలరాజు అనే ఎమ్మెల్యే వున్నాడు. ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి చైనా మ‌హిళా అంబాసిడ‌ర్‌తో రాహుల్ అమ్మిన దేశ ర‌హ‌స్యాల‌ను వివ‌రించాల‌ని డిమాండ్ చేశాడు. పిచ్చి కుదిరింది, రోక‌లిని మోకాలికి చుట్ట‌డం అంటే ఇదే. రాహుల్ నేపాల్ వెళ్లాడు. పెళ్లి పార్టీలో పాల్గొన్నాడు. ఆయ‌న ప‌క్క‌న ఎవ‌రో మ‌హిళ ఉంది. చైనా రాయ‌బారి అవునో కాదో తెలియ‌దు. ఆమెతో ఏం మాట్లాడాడో చెప్పాల‌ట‌. ఏం సెప్తివి బాల‌రాజు..

ఇంట‌ర్‌నెట్ యుగంలో మ‌నం ప్ర‌పంచంలోని ఎవ‌రితోనైనా వీడియో కాల్‌లో మాట్లాడొచ్చు. చైనా వాళ్ల‌కి ర‌హ‌స్యాలు చెప్పాల‌నుకుంటే ఫోన్‌లోనే చెప్పొచ్చు. మ‌న ఫోన్ ట్రాప్ చేస్తార‌ని అనుమానం వుంటే మ‌న ఇంటి ఎదురుగా మిర‌ప‌కాయ బ‌జ్జీల వాడి ద‌గ్గ‌ర కూడా స్మార్ట్ ఫోన్ వుంటుంది. దాంట్లోంచి చేసుకోవ‌చ్చు. ఈ డిజిట‌ల్ యుగంలో ర‌హ‌స్యం అనే ప‌ద‌మే కామెడీ.

టెక్నాల‌జీలో నిర‌క్ష‌రాస్యుడైన రాహుల్ ఇదంతా తెలియ‌క నేపాల్ వెళ్లి , అక్క‌డ ఒక పార్టీలో పాల్గొని మ‌హిళా రాయ‌బారితో కోడ్‌భాష‌లో మాట్లాడి దేశ ర‌హ‌స్యాల్ని కిలోల లెక్క‌న అమ్మేసి వ‌చ్చాడ‌ట‌. ఏంది బాల‌రాజు ఇది!

దేశ రాజ‌కీయాలే అర్థం కాని రాహుల్‌కి దేశ ర‌హ‌స్యాలు అర్థ‌మ‌వుతాయా?  దేశ ర‌హ‌స్యాలంటే కృష్ణ సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌, త్యాగ‌రాజు మార్చుకునే సూట్‌కేసుల్లో వుండ‌వు. దేశ భ‌ద్ర‌త అంటే ఆయుధ క‌ర్మాగారాలు, అణుకేంద్రాలు ఇలా చాలా వుంటాయి. వాటి గురించి చ‌దివే ఓపికా రాహుల్‌కి లేదు. చ‌దివినా ఆయ‌న‌కి అర్థం కావు.

అయినా రాహుల్‌ని చూస్తే మీకెందుకు భ‌యం? ఆయ‌న వ‌ల్ల ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది? తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే అది టీఆర్ఎస్ త‌ప్పుల వ‌ల్ల మాత్ర‌మే. అంతేకానీ, రాహుల్ వ‌చ్చి వెళితే అద్భుతాలేం జ‌ర‌గ‌వు.

కాంగ్రెస్‌లో యుద్ధ‌వీరులున్నారు కానీ, సొంత పార్టీలో యుద్ధం చేయ‌డానికే వాళ్ల‌కి స‌మ‌యం లేదు. ప్రయాణీకులు త‌క్కువ‌, కెప్టెన్లు ఎక్కువ వున్న షిప్ కాంగ్రెస్‌. దాన్ని ఎవ‌రూ ఏం చేయ‌లేరు. మునిగితే సొంతంగానే మునుగుతుంది.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?