Advertisement

Advertisement


Home > Politics - Telangana

వామ్మో....ఉప ఎన్నిక ఇంత సైన్య‌మా?

వామ్మో....ఉప ఎన్నిక ఇంత సైన్య‌మా?

మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక కోసం గ‌తంలో ఏ అధికార పార్టీ ఇంత భారీ స్థాయిలో పార్టీ సైన్యాన్ని వాడుకోలేదు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని 86 యూనిట్ల‌గా టీఆర్ఎస్ విడ‌గొట్టింది. ఒక్కో యూనిట్‌కు ఇన్‌చార్జ్‌గా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇన్‌చార్జ్‌ల‌ను ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ నెల 6వ తేదీ నుంచి అంద‌రూ మునుగోడులో త‌మ‌కు కేటాయించిన ప్రాంతాల్లో బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.

ఇందులో భాగంగా గ‌ట్టుప్ప‌ల్ ఎంపీటీసీ యూనిట్ ఇన్‌చార్జ్‌గా మంత్రి కేటీఆర్‌, మ‌ర్రిగూడ ఎంపీటీసీ యూనిట్ ఇన్‌చార్జ్‌గా మంత్రి హ‌రీష్‌రావు....ఇలా ప్ర‌తి ఒక్క‌ర్నీ మునుగోడులో మోహ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికే 100 ఓట‌ర్ల‌కు క‌లిపి ఒక ఇన్‌చార్జ్‌ను నియ‌మించి ప్ర‌చారం కూడా పూర్తి చేశారు.  

ఏడాదిలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఈ ఉప ఎన్నిక తీవ్ర ప్ర‌భావం చూప‌నుండ‌డంతో కేసీఆర్ అతి జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓట‌మి టీఆర్ఎస్‌ని భ‌య‌పెడుతోంది. మును గోడులో అలాంటి ఫ‌లితాలు ఎట్టి ప‌రిస్థితుల్లో పున‌రావృతం కాకూడ‌ద‌ని టీఆర్ఎస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. పైగా మునుగోడు కాంగ్రెస్ సీటు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక వ‌చ్చింది.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఆర్థికంగా స్థితిమంతుడు.  కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ త‌ర‌పున ఆయ‌న త‌ల‌ప‌డుతు న్నారు. దీంతో కోమ‌టిరెడ్డికి అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు పుష్క‌లంగా ద‌క్కుతాయి. మునుగోడు ఉప ఎన్నిక బిగ్ ఫైట్ అనే చెప్పాలి. టీఆర్ఎస్‌, బీజేపీ మునుగోడులో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌నున్నాయి. రెండు పార్టీల‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన కేడ‌ర్ వుంది. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. ఆ పార్టీకి రేవంత్‌రెడ్డి అద‌న‌పు బ‌లం. ప‌ట్టు నిలుపుకునేందుకు రేవంత్‌రెడ్డి గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా జాతీయ పార్టీ పెట్ట‌నున్న కేసీఆర్‌కు మునుగోడులో గెలుపు త‌ప్ప‌నిస‌రి. అధికారంలో వుంటూ ఉప ఎన్నిక‌లో ఓడిపోతే మాత్రం టీఆర్ఎస్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైన‌ట్టే. ఈ వాస్త‌వం బాగా తెలుసు కాబ‌ట్టే అడుగ‌డుగునా టీఆర్ఎస్ త‌న పార్టీ సైన్యాన్ని మోహ‌రించి, బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మైంది. ఉప ఎన్నిక‌కు కేవ‌లం నెల మాత్ర‌మే గ‌డువు వుంది. ఈ నెల రోజుల్లో ఎన్నెన్ని నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?