Advertisement

Advertisement


Home > Politics - Telangana

పైలట్ రాజధానిగా విశాఖ?

పైలట్ రాజధానిగా విశాఖ?

పైలట్ రాజధానిగా విశాఖ ఏమిటి? పైలట్ ప్రాజెక్ట్ అనే మాట విన్నాం. కానీ పైలట్ రాజధాని ఉంటుందా? అనే సందేహం రావొచ్చు. ఎస్ ...ఏపీ సీఎం జగన్ అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఒక విషయం మనసులో పడిందంటే ఏదో ఒక మార్గం ద్వారా దాన్ని సాధించి తీరుతాడు. అనుకున్నది చేయాలనుకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా చేసి చూపించే తత్త్వం జగన్ ది. అందులో భాగమే పైలట్ రాజధానిగా విశాఖ. 

సాధారణంగా ఏదైనా ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఒకటి రెండు ప్రాంతాల్లో అమలు చేసి వచ్చే ఫలితాలనుబట్టి దాన్ని రాష్ట్రమంతా లేదా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఇది మనకు తెలిసిన సంగతే. మూడేళ్ళ కిందట జగన్ ఏపీకి ఒక రాజధాని కాదు ...మూడు రాజధానులు ఉంటాయన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని అసెంబ్లీలో ప్రకటించారు.

ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తరువాత అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజాధానిగా ఉంచాలని అమరావతి రైతులు పోరాటం చేయడం, కోర్టు కేసులు కావడం, దీనిపైన ప్రతిపక్షాలకు -ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధం జరగడం, మీడియాలో అనేక కథనాలు రావడం, కేంద్ర మంత్రులు ఒక నిశ్చితమైన అభిప్రాయం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, మూడు రాజధానులపై కోర్టు తీర్పు రాకుండానే సంబంధిత బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకొని, మళ్ళీ పకడ్బందీగా బిల్లులను ప్రవేశపెడతామని చెప్పడం... ఈ ప్రహసనం మొత్తం తెలిసిందే. 

హైకోర్టు చెప్పినా ప్రభుత్వం అమరావతిని ముందుకు తీసుకుపోలేదు. జగన్ చూపు విశాఖ మీదనే ఉంది. విశాఖ రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరని మంత్రులు అనేకసార్లు చెప్పారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. రెండేళ్లలో జగన్ ప్రభుత్వ టర్మ్ ముగుస్తుంది. ఆ లోగా మూడు రాజధానుల కల నెరవేరేలా లేదు. కానీ ఎలాగైనా సరే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించాలనేది జగన్ కోరిక. 

ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారం కార్యాచరణలోకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల మధ్య జగన్ విశాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆగస్టులో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని రూపాంతరం చెందడం ఖాయమంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే తేల్చి చెప్పారు.

వారంలో మూడు రోజుల పాటు విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించేలా చర్యలు తీసుకోవాలని జగన్ జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో విశాఖపట్నం నుంచి వారంలో మూడురోజుల పాటు పరిపాలన సాగించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏ రోజు నుంచి పరిపాలన సాగిస్తే బాగుంటుందనే విషయంపై జగన్ గురువు అయిన విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సలహా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున పూర్తిస్థాయిలో తరలించే అవకాశాలు లేవు. అదే సమయంలో వారంలో మూడు రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన సాగించడం కుదరదనే ఆంక్షలను హైకోర్టు విధించలేదు. అటు కోర్టు తీర్పును గౌరవిస్తూనే పాక్షికంగా విశాఖ నుంచి పరిపాలన సాగించాలనే నిర్ణయంలో వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?