Advertisement

Advertisement


Home > Politics - Telangana

చికోటితో చీక‌టి సంబంధాలు ఎవ‌రెవ‌రికి?

చికోటితో చీక‌టి సంబంధాలు ఎవ‌రెవ‌రికి?

గ‌త కొన్ని రోజులుగా క్యాసినో, హ‌వాలా వ్య‌వ‌హారాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను వేడెక్కించాయి. ఈ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి చికోటి ప్ర‌వీణ్‌ను ఇవాళ ఈడీ విచారిస్తోంది. విచార‌ణ‌లో ప్ర‌వీణ్ ఏం చెబుతారు? ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌టికొస్తాయో అనే ఉత్కంఠ అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ వుంది. ఎందుకంటే చికోటి ప్ర‌వీణ్‌తో ఇరు రాష్ట్రాల్లోని పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు స్నేహ సంబంధాలు క‌లిగి ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో చికోటికి సంబంధించి ప‌లు అంశాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌వీణ్ వాట్సాప్‌లో నిక్షిప్త‌మైన కీల‌క స‌మా చారాన్ని ఈడీ ఇప్ప‌టికే గుర్తించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే అత‌ని ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ను ఈడీ ఇప్ప‌టికే సీజ్ చేసింది. చికోటి మాత్రం మీడియా ముందు నోరు తెర‌వ‌డం లేదు. ఏదైనా తాను ఈడీ ముందే త‌ప్ప‌, మీడియాకు చెప్పాల్సిన ప‌నిలేద‌ని తేల్చి చెప్పాడు.

చికోటి వ్య‌వ‌హారాన్ని ఇరు రాష్ట్రాల్లోని పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కులు రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. చికోటితో చీక‌టి సంబంధాలు మీకంటే మీక‌ని ప‌ర‌స్ప‌రం పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు బుర‌దజ‌ల్లుకుంటున్నారు. ఈ విష‌యంలో టీడీపీ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌వీణ్‌తో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ స్నేహ సంబంధాలు క‌లిగి వున్నార‌ని టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఏపీ కేబినెట్‌లోని స‌గం మంది మంత్రులు, 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు నేపాల్ వెళ్లి క్యాసినో ఆడార‌ని ఆయ‌న ఆరోపించారు. వారు బ‌స చేసిన హోట‌ల్‌పై విచార‌ణ చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఏమీ లేని చోట ఏదైనా సృష్టించ‌గ‌ల నేర్ప‌రులు టీడీపీ నేత‌లు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న టీడీపీ నేత‌ల‌కు కొడాలి నాని ఇప్ప‌టికే ఘాటైన స‌మాధానం ఇచ్చారు. త‌న‌కు ప్ర‌వీణ్‌తోనూ, క్యాసినో, హ‌వాలా వ్య‌వ‌హారాల‌తో సంబంధాలున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం కాద‌ని, ద‌మ్ముంటే అరెస్ట్ చేయించాల‌ని కొడాలి నాని స‌వాల్ విసిరారు.

తాజాగా ప్ర‌వీణ్‌ను ఈడీ విచారిస్తున్న నేప‌థ్యంలో ఎలాంటి సంచ‌ల‌నాలు బ‌య‌టప‌డ‌తాయోన‌నే ఉత్కంఠ నెల‌కుంది. విచార‌ణ నిమిత్తం ప్ర‌వీణ్ ఈడీ కార్యాల‌యానికి బ్యాంక్ స్టేట్‌మెంట్లు, న్యాయ‌వాదిని వెంట తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. సినీ, రాజ‌కీయ నేత‌ల‌కు భారీ మొత్తంలో ప్ర‌వీణ్ చెల్లింపులు చేశార‌నే వార్త‌ల నేప‌థ్యంలో, అస‌లు వాస్త‌వాలు ఏంటో తెలియాల్సి వుంది. ఈడీ విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యే వాస్త‌వాలు ఏఏ రాజ‌కీయ నేత‌లను ఇర‌కాటంలో పెట్ట‌నున్నాయో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?