Advertisement

Advertisement


Home > Politics - Telangana

విజ‌య‌మ్మ‌కు ప‌ద‌విపై ష‌ర్మిల ఏమ‌న్నారంటే....!

విజ‌య‌మ్మ‌కు ప‌ద‌విపై ష‌ర్మిల ఏమ‌న్నారంటే....!

త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు వైఎస్సార్‌టీపీలో ప‌ద‌విపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. తానొక మ‌హిళన‌ని, బిడ్డ‌ల త‌ల్లిన‌ని కూడా చూడ‌కుండా అధికార పార్టీ నాయ‌కులు అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని, అస‌లు వారు మ‌నుషులేనా అని ష‌ర్మిల ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు.

అలాగే వైఎస్సార్‌టీపీలో వైఎస్ విజ‌య‌మ్మ ప‌ద‌విపై స్పందించాల‌ని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ష‌ర్మిల స‌మాధానం ఇచ్చారు. విజ‌య‌మ్మ ప‌ద‌విపై ష‌ర్మిల మాట‌ల్లోనే....

"నేను ఇన్ని సంవ‌త్స‌రాలుగా, అవ‌స‌రం వ‌చ్చిన‌ ప్ర‌తిసారి ఏ ప‌ద‌వీ లేకుండానే చేయ‌గ‌లిగిన ప‌ని చేశాను. ప‌ని చేయ‌డానికి ప‌ద‌వులు అవ‌స‌రం లేదు. ప‌ని చేసేవాడు ప‌ద‌వులు లేకున్నా చేస్తాడు. ప‌నిచేయ‌ని వాడు ప‌ద‌వి ఉన్నా చేయ‌డు. ప‌నిచేసే వాడికి అస‌లు ప‌ద‌వులే అవస‌రం లేదు. అదే గొప్ప‌త‌నం. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి భార్య విజ‌య‌మ్మ‌. అలాంటి విజ‌య‌మ్మకు ఏ ప‌ద‌వి ఇచ్చినా త‌క్కువే. ప‌ద‌వి ఆశించ‌కుండా, రాజ‌శేఖ‌ర‌రెడ్డి సంక్షేమ పాల‌న మ‌ళ్లీ రావాల‌ని, నేను ప‌నిచేస్తాన‌ని చెప్పిన గొప్ప మ‌నిషి విజ‌య‌మ్మ‌. ప‌ద‌వుల‌తో సంబంధ‌మే లేదు" అని తేల్చి చెప్పారు.

గుంటూరులో వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీలో ఆ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంలో ఆమె భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న ఇద్ద‌రు బిడ్డ‌లు వేర్వేరు రాజ‌కీయ పార్టీల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నార‌న్నారు. వేర్వేరు ప్రాంతాల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ‌లో త‌న కుమార్తె ష‌ర్మిల ఒంట‌రి పోరాటం చేస్తోంద‌ని, మ‌రో ఏడాదిలో అక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, త‌ల్లిగా అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కష్టాల్లో ఉన్నప్పుడు త‌న‌ కొడుకు జగన్‌తో ఉన్నాన‌ని, సంతోషంలో కూడా అండగా ఉంటే త‌న‌ రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని మనస్సాక్షి చెబుతోంద‌ని ఆమె ఆవేద‌న చెందారు. త‌న‌ ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నాన‌ని, ఈ విషయంలో త‌న‌ను క్షమించాల‌ని ఆమె వేడుకున్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌టీపీ గౌర‌వాధ్య‌క్షురాలిగా విజ‌య‌మ్మ నియ‌మితుల‌వుతార‌ని అంద‌రూ భావించారు. కానీ త‌ల్లికి ప‌ద‌వితో సంబంధ‌మే లేద‌ని ష‌ర్మిల తాజా కామెంట్స్‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు ఏ ప‌ద‌వి లేకుండానే విజ‌య‌మ్మ‌ను పార్టీకి మ‌ద్ద‌తుగా ఊరూరా తిప్పాల‌ని ష‌ర్మిల భావిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లొస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?