ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు. సమాజంలో అన్యాయం వికటాట్టహాసం చేస్తున్నప్పుడు…సామాన్యులకు కొండంత ధైర్యం కేవలం న్యాయస్థానం మాత్రమే. అందుకే న్యాయాన్ని దేవతతో పోల్చుతుంటారు. న్యాయానికి ఓటమి తాత్కాలికమే తప్ప…శాశ్వతం కాదు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది.
కరోనా మహమ్మారి ఇప్పుడా న్యాయాలయం కూడా మూసివేసేలా విజృంభిస్తోంది. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా కరోనా వైరస్ సర్వం వ్యాపిస్తోంది. తన ఆగడాలకు అడ్డూ అదుపూ లేవని ఆచరణలో చూపుతోంది. కరోనా మహమ్మారి సెగ తాజాగా తెలంగాణ హైకోర్టును కూడా తాకింది. ఏకంగా 25 మంది న్యాయస్థాన ఉద్యోగులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రేపటి (గురువారం) నుంచి హైకోర్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్‌ను పారదోలేందుకు హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో కొందరు కరోనా బారిన పడడంతో చీఫ్ జస్టిస్ మహేశ్వరి కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. హైదరా బాద్‌లో కోవిడ్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు మూసివేత నిర్ణయం సరైనదే. ఎందుకంటే మరింత మంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే, దానికి దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కార మార్గం. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుసరించిన విధానాన్ని మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.