తెలుగు మహిళా ఎంపీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, ఆమెకు జరిమానా కూడా వేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జైలు శిక్షకు గురైన ఆ మహిళా ఎంపీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కావడం గమనార్హం.
టీఆర్ఎస్ మహిళా నేత మాలోత్ కవిత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారనే కారణంతో బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో కవితపై కేసు నమోదైంది. దీనిపై అప్పటి నుంచి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ నిర్వహిస్తోంది.
నేరారోపణ రుజువు కావడంతో టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పు మేరకు ఆమె రూ. 10వేల జరిమానా చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు పంచడం, ఆ నేరం రుజువై శిక్ష పడడంతో ప్రత్యర్థులకు ఒక ఆయుధం లభించినట్టైంది. అందులోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమాయత్తం అవుతున్న తరుణంలో అధికార పార్టీ ఎంపీకి ప్రజాప్రతినిధుల కోర్టు శిక్ష వేయడం, టీఆర్ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితే అని చెప్పక తప్పదు.