చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు తమన్. కెరీర్ స్టార్టింగ్ లో ఎంతోమంది హీరోలు అవకాశాలిచ్చారు. మహేష్ లాంటి హీరో కూడా దూకుడుతో తమన్ కు ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఇలా కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగిన తమన్.. ప్రస్తుతం తను ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ కు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అంటున్నాడు.
“నేను ఇంత సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరక్టర్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్. అరవింద సమేత తర్వాత నా కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. ఆ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే ఇస్తాను. నాలో ఈ మ్యూజికల్ మార్పుకు కారణం త్రివిక్రమ్.
నా మ్యూజిక్ ను ఆయన పూర్తిగా మార్చేశారు. చాలా అందంగా వివరించి చెప్పారు. ఆయనతో నా ప్రయాణం కేవలం సంగీతానికే పరిమితం కాదు. నా జీవితంలో కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు నేనున్న ఈ పొజిషన్ కు కారణం త్రివిక్రమ్. 2018 నుంచి ఆయన నాకు పరిచయం. ఈ 4 ఏళ్లలోనే నా జీవితం మొత్తం మారిపోయింది.”
అలా తన స్టార్ డమ్ క్రెడిట్ మొత్తాన్ని త్రివిక్రమ్ కు కట్టబెట్టాడు తమన్. ప్రస్తుతం పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్ సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తున్న ఈ మ్యూజిక్ డైరక్టర్.. కంటెంట్ బాగుంటే షార్ట్ ఫిలింకు కూడా సంగీతం అందిస్తానంటున్నాడు. డబ్బులు కూడా అడగనంటున్నాడు.
“నేను చిన్న సినిమాలకు దూరమైపోలేదు. గతంలో రెమ్యూనరేషన్ తీసుకోకుండా కూడా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి సినిమల్లో చిన్న-పెద్ద చూడను. కథ నచ్చితే షార్ట్ ఫిలింకి కూడా మ్యూజిక్ ఇస్తాను. వెబ్ సిరీస్ లు కూడా చేస్తాను. నాకు నచ్చితే డబ్బులు కూడా తీసుకోకుండా పనిచేస్తాను.”
వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సంగీత దర్శకుడు.. తను ఎదురుచూస్తున్న మూవీ మాత్రం ఇంకా పడలేదంటున్నాడు. ఫుల్ లెంగ్త్ స్పోర్ట్స్ జానర్ సినిమా చేయాలని ఉందని, అలాంటి సినిమాలో ప్రయోగాలు చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని, ఇప్పటివరకు అలాంటి సినిమా ఆఫర్ తనకు రాలేదంటున్నాడు.