ఆ జోక‌రే దిక్క‌య్యారే!

జోక‌ర్ అనే మాట‌ను ఎగ‌తాళిగా వాడుతుంటారు. కానీ పేకాట‌లో జోక‌ర్‌కు ఉన్న విలువ తెలిసిందే. స‌ర్క‌స్‌లో, సినిమాలో క‌మెడియ‌న్ ఎప్పుడెప్పుడు క‌నిపిస్తాడా? అని ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే క‌మెడియ‌న్ త‌న చేష్ట‌ల‌తో న‌వ్విస్తాడు, క‌వ్విస్తాడు.…

జోక‌ర్ అనే మాట‌ను ఎగ‌తాళిగా వాడుతుంటారు. కానీ పేకాట‌లో జోక‌ర్‌కు ఉన్న విలువ తెలిసిందే. స‌ర్క‌స్‌లో, సినిమాలో క‌మెడియ‌న్ ఎప్పుడెప్పుడు క‌నిపిస్తాడా? అని ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే క‌మెడియ‌న్ త‌న చేష్ట‌ల‌తో న‌వ్విస్తాడు, క‌వ్విస్తాడు. జోక‌ర్ లేదా క‌మెడియ‌న్ వ‌ల్ల మ‌న‌సు రిలాక్స్ అవుతుంది.

అంటే మ‌న‌ల్ని రీఫ్రెష్ చేస్తాడ‌న్న మాట‌. మ‌న‌సును రీఫ్రెష్ చేసుకుంటే త‌ప్ప మ‌నలో కొత్త ఉత్సాహం రాదు. జీవితం ముందుకు సాగ‌దు. అందువ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌సును ఉల్లాసప‌రుచుకునేందుకు కాసింత హాస్యం కోసం ఆక‌లిగొన్న‌ట్టు ఉంటాం. అందుకే సినిమాలు, కామెడీ షోలు చూసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తాం.

ఇక రాజ‌కీయ రంగంలో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌ను అంద‌రూ ఓ క‌మెడియ‌న్‌గా చూస్తుంటారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఆయ‌న కూడా లేక‌పోతే ….సీరియ‌స్ రాజ‌కీయాల‌తో త‌ల వేడెక్కి బొప్పి క‌ట్టేద‌ని స‌ర‌దాగా అనుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అంద‌రూ జోక‌ర్‌గా, కామెడీ పొలిటీషియ‌న్‌గా పిలుచుకున్న కేఏ పాల్ తాజాగా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై తీసుకున్న చర్య అభినంద‌న‌లు అందుకుంటోంది.

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌నే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ప్ర‌తినిధి జ్యోతిబెగ‌ల్  హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఉక్కు క‌ర్మాగారాన్ని బ‌లోపేతం చేసేందుకు దీర్ఘ‌కాలిక చ‌ర్య‌లు చేప‌ట్టేలా కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని  ఆ పిటిష‌న్‌లో కోరారు.

ఇనుప ఖ‌నిజం గ‌నుల లీజు కేటాయింపును ప‌రిశీలించేలా త‌గిన ఆదేశాల‌ను ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా  కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, ఉక్కు అభివృద్ధిశాఖ కార్య‌ద‌ర్శి, కేంద్ర‌గ‌నుల‌శాఖ కార్య‌ద‌ర్శి , రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్‌/ విశాఖ స్టీల్ ప్లాంట్‌) చైర్మ‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని వ్యాజ్యంలో ప్ర‌తివాదులుగా చేర్చ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌జ‌ల కోసం తాము రాజ‌కీయాలు చేస్తామంటున్న ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు కేఏ పాల్ చేసిన ప‌ని ఎందుకు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికార ప‌క్షం వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, ప్ర‌జాప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడ‌డంలో ఆ రెండు పార్టీలు దొందు దొందే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే …విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేట్‌ప‌రం చేయాల‌ని నిర్ణ‌యించిన బీజేపీకి మిత్ర‌ప‌క్షం కావ‌డంతో విన‌తులే త‌ప్ప ఉద్య‌మాల జోలికే వెళ్ల‌డం లేదు. ఈ నేప‌థ్యంలో జోక‌ర్ లీడ‌ర్‌గా అవ‌హేళ‌న చేసే కేఏ పాల్ చివ‌రికి ఏపీకి దిక్కుఅయ్యారంటున్నారు. 

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా త్వరలో

‘ఉప్పెన’ మన నేటివ్‌ కథ