ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ప్రపంచంలో ఏ మూలో దాక్కున్న ఒమిక్రాన్ ఆంధ్రా ముంగిటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒమిక్రాన్ లక్షణాలు ఏమంత ప్రమాదకరంగా లేవనే సమాచారం మాత్రం కొంత ఊరట కలిగిస్తోంది.
విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి గత నెల ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
అతనికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అనంతరం శాంపిల్స్‌ను హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. దాని ఫలితం… ఒమి క్రాన్‌గా నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతకు ముందు ముంబయిలో సదరు వ్యక్తికి వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైతేనేం ఒమిక్రాన్ కేసు ఆంధ్రాలో బయట పడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఈ కేసుతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్ కేసులున్నాయి.
అతి ఎక్కువ ఒమిక్రాన్ కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. ప్రజానీకం ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా కరోనా నిబంధలను పాటించాలని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది