ఉత్తరాదిలో చాలా పాపులర్ అయిన యూపీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ) దక్షిణాదివారికి అంతగా పరిచయం లేదు. దాని ఉనికి కూడా ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో బీఎస్పీ పేరు వినబడుతోంది. ఇందుకు కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణా గురుకులాల సంస్థ మాజీ ఉన్నతాధికారి అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇంకా ఆరేళ్ళ సర్వీసు ఉండగానే విఆర్ఎస్ తీసుకున్న ఈయన వల్ల బీఎస్పీ పార్టీ పేరు మళ్ళీ మోగుతోంది. పదవి వదులుకున్న తరువాత రాజకీయ మార్గంలో ముందుకు పోవాలని నిర్ణయించుకున్న ప్రవీణ్ కుమార్ అందరి మాదిరిగా అధికార టీఆర్ఎస్ వైపో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వైపో చూడలేదు. ఆయన భావ జాలానికి ఈ పార్టీలు సరిపోవు. అందుకే బహుజన సమాజ్ పార్టీని ఎంచుకున్నారు.
ఆగస్టు 8న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనంతరం దళిత, బహుజన మేధావులతో ఆయన భేటీ కానున్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణలో బీఎస్పీ బలపడుతుందని మాయావతి ప్రకటించారు. అయితే తెలంగాణా ప్రజలకుగానీ, ఇక్కడి రాజకీయ పార్టీలకుగాని బీఎస్పీ కొత్త కాదు.
గతంలో బీఎస్పీ నుండి తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు కోనప్ప బీఎస్పీ నుండే టికెట్ సాధించి 2014 ఎన్నికల్లో గెలుపొందారు అనంతరం ఇద్దరు కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. దీంతో తెలంగాణలో బీఎస్పీ కథ ముగిసింది. ఇప్పుదు ప్రవీణ్ కుమార్ కారణంగా దాని పునరుద్ధరణ జరిగింది.
ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తరువాత దానికి సంబంధించిన చర్చలన్నీ పూర్తి చేసుకున్నారు. ముహుర్తం కూడా ఖరారు చేశారు. తన రాజీనామా లేఖలో కాన్షిరామ్ గురించి ప్రస్తావించారు ప్రవీణ్. అయితే బీఎస్పీలో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయన మాత్రం.. బీఎస్పీని ఎంచుకున్నారు. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్‌జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారని స్వేరోలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
రాజకీయాల్లో ప్రవీణ్ కుమార్ రాణిస్తారో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం దళిత వర్గానికి బలమైన నాయకుడిగా ఎదగాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాన్షిరామ్‌లాగా.. మాయవతిలా.. అడుగులు వేయాలని అనుకుంటున్నారు. అందుకే.. తన ప్రతి మాటలోనూ దళిత వాదమే వినిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంలో స్టేజిపై ఉన్న ఇతర కులాల నేతల్ని కౌశిక్ రెడ్డి గౌరవంగా గారు అని సంభోదించి దళిత నేతల్ని మాత్రం పేరు పెట్టి పిలిచారు. ఈ విషయాన్ని కూడా ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు.
ఇది కుల అహంకారమే అంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాజ్యాధికారం రాదని.. పోరాటం చేయాలని.. కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఓ పదవి కోసమే అయితే ఆయనకు కాంగ్రెస్,టీఆర్ఎస్, బీజేపీ రెడ్ కార్పెట్ వేసి పిలిచేవి. కానీ ఆయన అంతకు మించి ఆలోచిస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ సాదాసీదా ఐపీఎస్ కాదు. ఆయన ఐపీఎస్ అయినా.. పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకున్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాల వ్యవహారాలను తొమ్మిదేళ్లుగా తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నారు. ” స్వేరోస్” అనే సంస్థను పాతుకుపోయేలా చేయగలిగారు. సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ను స్వేరోస్‌గా పిలుస్తారు. ఈ సంస్థను ప్రవీణ్ కుమార్ ప్రారంభించలేదు. కానీ ఈ సంస్థకు వెన్నుముకగా ఆయన నిలిచారు.
ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకుల హాస్టళ్లలో స్వేరోస్ విస్తృతంగా విస్తరించారు. మెల్లగా స్వేరో భావాజాలాన్ని దళిత కాలనీలకు విస్తరించారు. స్వేరోస్ భావజాలం.. చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు వీరినే ప్రవీణ్ కుమార్ తన బలంగా భావిస్తున్నారు. దళిత భావజాలాన్ని అందుకే విస్తృతంగా వినిపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది దళితులున్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 17.5 శాతం. వీరు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగలరు. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. దళిత వాదం అందుకుంటున్నారు. అయితే.. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంటుంది.
ఆ అసంతృప్తి నుంచి ఇప్పటి వరకూ ఒక్క సరైన నాయకుడు పుట్టుకు రాలేదు. ఇప్పుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని అంటున్నారు. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆయన చాలా కాలం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన ముందు ముందు ఎంత ప్రతిభావంతంగా అడుగులు వేస్తారన్నదానిపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలను సమూలంగా మార్చాలన్నది ఆయన ఆకాంక్ష. మొదట్లో లోక్ సత్తా అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి ఆ తరువాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. ఆయన అనుకున్నట్లు రాజకీయాలను మార్చలేకపొయారు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అంతే …ఆయన కథ, లోక్ సత్తా కథ ముగిసిపోయింది. ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసేనాటికి ఆయనకు ఇంకా చాలా సర్వీసు మిగిలి ఉంది.
రాష్ట్రం విడిపోయాక సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మి నారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసిన, జగన్ ను జైలుకు పంపిన అధికారిగా లక్ష్మీనారాయణ చాలా పాపులర్. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉండగానే పదవిని వదులుకున్న లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
పవన్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నారని విమర్శలు చేసి జనసేన నుంచి వెళ్లిపోయారు. జయప్రకాష్, లక్ష్మీనారాయణ ఇద్దరూ రాజకీయాల్లో విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఇప్పుదు ప్రవీణ్ కుమార్ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యాడు. ఈయన ఎంతవరకు నిలదొక్కుకుంటారో చూడాలి.