వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధించిన ఏకైక విజయం ఏదైనా ఉందా? అంటే…. అది సుప్రీంకోర్టులో తాజాగా సీఐడీ సమర్పించిన అఫిడవిట్‌గా పేర్కొనాలి. దీన్ని ఎందుకు విజయంగా చెప్పాల్సి వస్తోందంటే… అఫిడవిట్‌పై ప్రధాన ప్రత్యర్థితో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా కూడా ఇక నోరెత్త లేని దయనీయ పరిస్థితి. బహుశా పచ్చ బ్యాచ్‌కు ఇది ఊహించని పరిణామంగానే చెప్పొచ్చు.
సాధారణంగా జగన్ ఏం చేసినా చిలువలుపలువులుగా తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని చిత్రీకరించే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ….సుప్రీంకోర్టుకు సీఐడీ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు నైతికంగా తీవ్రంగా నష్టం కలిగించే తీవ్ర అంశాలున్నా, తేలుకుట్టినట్టుగా చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతలు నొప్పిని భరిస్తూ కూడా నోర్మూసుకుని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సాగించిన వాట్సాప్ సంభాషణ, చాటింగ్ వ్యవహారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రఘురామకృష్ణరాజు వెనుక టీడీపీ, ఎల్లో మీడియా ఉందని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు బలం కలిగించే ఆధారాలను సీఐడీ వెలుగులోకి తెచ్చింది. చంద్రబాబు సూచనతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్టు సీఐడీ తేల్సిసింది.
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రఘురామకృష్ణరాజుతో కలిసి పన్నిన కుట్రలపై సవివరంగా పేర్కొన్న అంశాలపై ఇప్పటి వరకూ చంద్రబాబు, లోకేశ్ సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడు నోరు మెదపకపోవడం దేనికి సంకేతం? మౌనం అంగీకారానికి సంకేతమని అర్థం చేసుకోవాలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటి వల్ల న్యాయస్థానంలో ఏమీ కావని కాసేపు అనుకుందాం. కానీ చంద్రబాబు భయం మరోలా ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే ఫైనల్. రఘురామతో కలిసి జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కుట్రలు పన్నారని ఈ అఫిడవిట్‌తో జనంలోకి స్పష్టమైన సమాచారం వెళ్లిపోయింది. ఇది తనకు మరో మచ్చలా మిగిలిపోతుందనే భయం ఆయన్ని వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.
దీన్ని ప్రజలు అసహ్యించుకుంటే… జరగబోయే పరిణామాలేంటో తెలుసుకాబట్టే చంద్రబాబు భయంతో నోరు మెదపడం లేదనే వాదన వినిపిస్తోంది. మొట్టమొదటి సారిగా ప్రత్యర్థులను నోరెత్తనీవకుండా చేయడంతో జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నడుచుకుందనే చెప్పాలి. బహుశా జగన్ తన రెండేళ్ల పాలనలో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సాధించిన ఏకైక విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు.