పార్టీ లైన్ గీసింది …అయినా సంతోషంగానే ఉంది

బూర్జువా పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు చాలా తేడా ఉంది. ఇప్పటి రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభ తగ్గిపోయి ఉండొచ్చు. కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని మిగతా రాజకీయ పార్టీలు అంటూ ఉంటాయి. మన రాష్ట్రంలో…

బూర్జువా పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు చాలా తేడా ఉంది. ఇప్పటి రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభ తగ్గిపోయి ఉండొచ్చు. కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని మిగతా రాజకీయ పార్టీలు అంటూ ఉంటాయి. మన రాష్ట్రంలో అయితే కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలు అని అంటూ ఉంటారు. ఎవరుపడితే వారితో పొత్తు పెట్టుకొని ఆ పార్టీలు సిద్ధాంతాలు వదిలేశాయని విమర్శిస్తూ ఉంటారు.

ఒకప్పుడు విలువలకు ప్రాధాన్యమిచ్చిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు భ్రష్టు పట్టాయని కొందరు తిడుతూ ఉంటారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని అంటారు. కమ్యూనిస్టు పార్టీల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రజల ఆదరణ లేకపోవడానికి, ఎన్నికల్లో ఆ పార్టీలు గెలవకపోవడానికి (కేరళలాంటి రాష్ట్రాలు మినహాయింపు) అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ విశ్లేషించుకోవడం ఇప్పుడు సందర్భం కాదు. 

కమ్యూనిస్టు పార్టీల్లోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. పార్టీలు అంటే ఒక పదార్ధమో, వస్తువో కాదు కదా. మనుషుల సమూహమే కదా. మరి లోపాలు లేకుండా ఎలా ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీల్లోనూ కొందరు చీడ పురుగులు ఉన్నారు. భ్రష్టు పట్టిపోయిన వారు ఉన్నారు. ఎవరో కొద్దిమంది ఇలాంటి వారు ఉన్నారని, కమ్యూనిస్టు పార్టీలే భ్రష్టు పట్టాయని ఎలా అంటాం ? కానీ ఇప్పుడు బూర్జువా పార్టీలు అలాగే ప్రచారం చేస్తున్నాయి.

కమ్యూనిస్టు పార్టీల్లో కొన్ని లోపాలున్నా నాన్- కమ్యూనిస్టు పార్టీలంత భ్రష్టు పట్టలేదు. చెడిపోలేదు. నీతినిజాయితీలను గాలికి వదిలేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీని ఆహా …ఓహో అని ఆకాశానికి ఎత్తుతున్నారు. కానీ అటల్ బిహారీ వాజపేయి పాటించిన విలువలను మోడీ పాటిస్తున్నారా ? రాజనీతిని అనుసరిస్తున్నారా ? ఒకప్పుడు ఇతర బూర్జువా పార్టీల కంటే బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అనే పేరుండేది. సిద్ధాంత బలం ఉన్న పార్టీగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇతర బూర్జువా పార్టీలకు మించి భ్రష్టు పట్టిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు. అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ బూర్జువా పార్టీల్లో లేని విలువలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ ఆ పార్టీల్లో ఉన్నాయని చెప్పొచ్చు. పార్టీ గీసిన గీతను దాటని నాయకులు, పదవుల కోసం ఆరాటపడని నాయకులు, పార్టీలో తమకు తగిన న్యాయం జరగలేదని భావించినా పార్టీపై తిరుగుబాటు చేయని నాయకులు, సొంత ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించని నాయకులు ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నారు. పార్టీ ద్రోహులు, ఫిరాయింపుదారులు కొందరు ఉన్నా బూర్జువా పార్టీలతో పోల్చుకుంటే చాలా..చాలా తక్కువ. 

మనం ఇంతా చెప్పుకోవడానికి కారణం కేరళ మాజీ మంత్రి శైలజ. కొందరు ఆమెను శైలాజా టీచర్ అంటారు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు టీచర్ కాబట్టి. పినారయి విజయం మొన్న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శైలజకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో చాలామంది ( సినిమా తారలు సహా) విజయన్  మీదా, సీపీఎం మీదా విమర్శలు  చేశారు. శైలజ పట్ల ఇంతటి సానుభూతి, అభిమానం ఎందుకంటే కరోనా మొదటి దశలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె పేరు మారుమోగిపోయింది.

కరోనా నియంత్రణకు ఆమె చేసిన అద్భుతమైన కృషికి బ్రహ్మాండమైన ప్రశంసలు లభించాయి. అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దశలో శైలజకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? అని అనేకమంది ప్రశ్నించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో మహమ్మారికి కట్టడికి ఎంతగానో కృషి మాజీ ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజకు రెండో సారి కేబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదో వివరణ ఇచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. 

కమ్యూనిస్టు పార్టీల్లో వ్యక్తులకు ప్రాధాన్యం లేదు. పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ ప్రకారమే ఎంతటివారైనా నడుచుకోవాలి. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈసారి  కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకున్నారు. టికెట్ ఎవరికివ్వాలి? మంత్రిగా ఎవరిని తీసుకోవాలి? అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల కమిటీ చేతుల్లో ఉంటుంది. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. శైలజను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం ముఖ్యమంత్రి చేతుల్లో లేదు. అది పార్టీ నిర్ణయం. కాగా..తనను రెండోసారి కేబినెట్ లోకి తీసుకోకపోవటంపై మాజీ మంత్రి శైలజ కూడా స్పందించారు.

తనను కేబినెట్ లోకి తీ కోవటం..తీసుకోకపోవటం పూర్తిగా పార్టీ నిర్ణయమనీ..పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా తాము సంతోషంగా అమలు చేస్తామని సీపీఎం పార్టీలో పదవుల కోసం పనిచేసేవారు లేరని..పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటమే కార్యకర్తల పని అని..కొత్తవాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వటంలో సీపీఎం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని స్పష్టంచేశారు.

పార్టీ రెండో సారి అధికారంలోకి రావటం చాలా సంతోషంగా ఉందని..కొత్తవాళ్లను కేబినెట్ లోకి తీసుకోవటమనేది చాలా మంచి విషయమని అన్నారు. ఇది తన ఒక్కరికే కాదనీ..గత కేబినెట్ లో ఉన్నవారిని ఎవ్వరినీ  కూడా రెండోసారి కేబినెట్ లోకి తీసుకోదని ఈ సందర్భంగా శైలజ గుర్తు చేశారు.పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నానని స్పష్టంచేశారు.

కాగా కేకే శైలజ మంచి పేరొందిన టీచర్.కేరళ ఆరోగ్యశాఖా మంత్రిగా నిఫా వైరస్,కరోనా వైరస్ వంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని ప్రజల కోసం తీవ్ర కృషి చేశారు. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో సమర్థవంతంగా పనిచేసిన శైలజ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. యూకేకు చెందిన ఓ మ్యాజైన్ ఆమెను ''టాప్ థింకర్ ఆఫ్ ద ఇయర్'' గా కూడా ఎంపిక చేయటం ఆమె కృషికి నిదర్శం.

ఇటీవల కేరళలో జరిగిన ఎన్నికల్లో ఆమె మట్టన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 61.97 శాతం ఓట్లతో గెలుపొందారు. విజయన్ కంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. ఇదే బూర్జువా పార్టీల్లో అయితే ఈపాటికి ఎంత రచ్చ జరిగేదో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా.