ముల్లును ముల్లుతోనే తీయాలి 

తెలంగాణా సీఎం కేసీఆర్ మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏమిటంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేతలను ఆయన పట్టించుకోలేదని. ప్రత్యేక రాష్ట్రం కోసం భీకరంగా పోరాడిన వారిని, చనిపోయినవారి కుటుంబాలను, బలిదానాలు చేసుకున్నవారి…

తెలంగాణా సీఎం కేసీఆర్ మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏమిటంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేతలను ఆయన పట్టించుకోలేదని. ప్రత్యేక రాష్ట్రం కోసం భీకరంగా పోరాడిన వారిని, చనిపోయినవారి కుటుంబాలను, బలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది కూడా. అందుకు పెద్ద ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం.

అసలు తెలంగాణా ఉద్యమాన్ని నడిపింది కేసీఆరా? కోదండరామా ? అని ప్రశ్నించుకుంటే ఒక విధంగా కోదండరామేనని చెప్పాలి. కొత్త విధానాలతో, కొత్త పోరాట పంథాతో ఉద్యమాన్ని పరుగులు పెట్టించింది కోదండరామే. అప్పటి పోరాట విధానాలను ఇప్పటికీ ఏదైనా సమస్య మీద ఆందోళన చేసేవారు పాటిస్తూనే ఉన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన ఉద్యమ స్ఫూర్తిని వదిలిపెట్టి పక్క రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. 

ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని, సమైక్య ఆంధ్రాను సమర్ధించిన వారిని, తనను నానా బూతులు తిట్టినవారిని రాజకీయ ప్రయోజనాల కోసం అందలం ఎక్కించారు. అంటే మంత్రి పదవులు, ఇతర పదవులు ఇచ్చారన్న మాట. ఇలాంటి వాళ్ళను బంగారు తెలంగాణా బ్యాచ్ అంటున్నారు. క్లుప్తంగా బీటీ బ్యాచ్ అంటారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పుణ్యామా అని ఉద్యమకారుల గురించి కేసీఆర్ మళ్ళీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈటల టీఆర్ఎస్ నాయకుడి కంటే ఉద్యమకారుడిగానే పాపులర్. ప్రతిపక్షాలు కూడా ఆయన్ని ఉద్యమకారుడిగానే చూస్తున్నాయి. ఈటలను మంత్రులు ఎంతగా తీసిపారేస్తున్నా, కించపరుస్తున్నా లోపల కాస్త భయపడుతూనే ఉన్నారు. కేసీఆర్ కు కూడా భయం ఉండొచ్చు. హుజూరాబాద్ టీఆర్ఎస్ చేజారుతుందా అనే అనుమానం ఏ మూలనో ఉంది. 

అందులోనూ బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేయబోతున్నాడు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లుగా ఈటలకు పోటీగా ఉద్యమ నాయకుడినే రంగంలోకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అలాగే తెరవెనుక కథ నడిపించేవారు కూడా ఉద్యమ నాయకులే కావాలని సీఎం అనుకుంటున్నారట. 

హుజూరాబాద్‌పై టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల రాజేందర్ వంటి బలమైన నేతను ఉప ఎన్నికల్లో ఓడించడం అంత ఈజీ కాదనే విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ నాయకత్వం.. ఇందుకోసం పలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో మొదటి నుంచి పని చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు ఉద్యమ నేతలనే రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడానికి ముందే అక్కడ పని చేయడానికి కొంతమంది నేతలను ఎంపిక చేసే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. వారిలో ఎక్కువ మంది ఉద్యమ నేతలే ఉండాలని భావిస్తున్నారని టాక్. ఇక ఈటల రాజేందర్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చే ఉద్యమ నేతలను ఎంపిక చేసే పనిలో ఉన్న టీఆర్ఎస్ అధినేత.. మండలాలు, గ్రామాలు వారీగా వారికి బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్‌తో పాటు తాము కూడా పని చేశామని.. నాటి ఉద్యమకారుల్లో ఎక్కువమంది ఇంకా టీఆర్ఎస్‌లోనే ఉన్నారని ఆ నేతలంతా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో చెప్పేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌లో కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కూడా తన వ్యూహాలను పదునుపెడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక  హుజురాబాద్ ఎన్నిక కారణంగా మొత్తం కరీంనగర్ జిల్లాకే మహర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అసెంబ్లీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రత్యర్థి పార్టీ బీజేపీలో చేరుతుండటంతో టీఆర్ఎస్ వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి..ఎన్నికల కోసం సీఎం కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.. భవిష్యత్ పరిణామాణాలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ అభివృద్దికి శ్రీకారం చుట్టారు..ఇందుకోసం పెండింగ్ పనులకు నిధులు విడుదల చేస్తారట.

ఇందులో భాగంగానే లోయర్ మానేరు నదిని సుందరీకరణ చేస్తారు. అంటే అందంగా తయారు చేస్తారన్న మాట. మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా … నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి  రూ 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ జీవో కాపీని సిఎం కెసిఆర్ స్వయంగా తన చేతుల మీదుగా ఆ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కు అందచేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రత్యేకంగా హుజూరాబాద్ పైన ఫోకస్ చేస్తారు. ఒక్క ఉప ఎన్నికకారణంగా జిల్లా మొత్తం బాగుపడే అవకాశం వచ్చిందని జనాలు, నాయకులు సంతోషిస్తున్నారు.