విశాఖలో “గీతం” విశ్వవిద్యాలయం ఆక్రమిత భూముల్లో నిర్మాణాల తొలగింపు రాజకీయంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో “గీతం” విశ్వవిద్యాలయం భూదాహంపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ విసిరిన సెటైర్ సూపర్బ్ అని ప్రశంసలు అందుకుంటోంది.
యువ ఎమ్మెల్యే అయిన అమరనాథ్ వాక్చాతుర్యం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లలో పాల్గొంటూ ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తుంటారు. తాజాగా తన ప్రాంతంలో గీతం విశ్వవిద్యాలయం అక్రమాలపై కూడా అమరనాథ్ గట్టిగా మాట్లాడుతున్నారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విరుచుకుపడ్డారు. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.
గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని గుడివాడ అమరనాథ్ చెప్పుకొచ్చారు. కోర్టు ఆర్డర్‌ను కూడా గీతం యాజమాన్యం వక్రీ కరించి ప్రచారం చేస్తోందని తప్పు పట్టారు.
గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలను మాత్రమే తొలగించవద్దని కోర్టు సూచించిందన్నారు. కానీ టీడీపీ పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తమ ఆధీనంలోని 43 ఎకరాలను క్రమబద్ధీకరించాలని ఆగస్టు 3న సీఎం వైఎస్ జగన్‌ను గీతం యాజమాన్యం కోరిందన్నారు. ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు గీతం తీసుకుందన్నారు. అది చాలదని మళ్లీ భూమి కావాలని కోరిందన్నారు.
గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుందని అద్భుతమైన సెటైర్ విసిరారు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుందే తప్ప… ఇలాంటి భూదాహం వున్న వ్యక్తులకు కాదని అమరనాథ్ స్పష్టం చేశారు.
టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోందని చురకలంటించారు. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుందన్నారు. మొత్తానికి గీతం యాజమాన్యాన్ని యువ ఎమ్మెల్యే చెడుగుడు ఆడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.