ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలనలో అనేక మందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. కొన్ని నియామకాలు పూర్తిగా రాజకీయపరమైనవి కావడంతో విమర్శలొచ్చాయి.
కనీస అర్హత లేని వాళ్లను కూడా అందలం ఎక్కించారని వైసీపీ శ్రేణుల నుంచే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సర్కార్ చేపట్టిన ఓ నియామకం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ప్రతిపక్షాలు కూడా హర్షించేలా ఆ నియామకం జరిగింది.
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా డాక్టర్ వి.భాస్కరసాయికృష్ణ యాచేంద్రను జగన్ సర్కార్ నియమించింది. ఈ మేరకు రెండేళ్లు ఆ పదవిలో కొనసాగేలా బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రాజ కుటుంబ సభ్యుడు డాక్టర్ వి.భాస్కరసాయికృష్ణ యాచేంద్ర. ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవికి యాచేంద్ర అన్ని విధాలా అర్హులని చెప్పాలి. సంగీత గేయధార సృష్టికర్తగా ప్రపంచ వ్యాప్తంగా ఆయన 400 ప్రదర్శనలు ఇచ్చారు.
సంగీయ గేయధార అంటే సంగీతం, సాహిత్యం, అవధానం, గానం సమ్మిళితం. సహజంగానే కళాహృదయమైన సాయికృష్ణ యాచేంద్ర తనకు ఇష్టమైన రంగంలో శిఖరపు అంచులను ముద్దాడారు. చెన్నైలోని వివేకానంద కళాశాలలో పీయూసీ, బీఏ పూర్తి చేశారు. చెన్నైలో ప్రసిద్ధ కవి సి.నారాయణరెడ్డితో పరిచయం ఆయన కళాత్మక హృదయానికి పదును పెట్టినట్టైంది.
సినారె ప్రేరణ, స్ఫూర్తితో యాచేంద్ర తెలుగుపై మమకారాన్ని పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత 1972 నుంచి 74 వరకు చెన్నైలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన జ్ఞాన తృష్ణ తీరలేదు. కవిత్రయ మహాభారతంలో శ్రీకృష్ణ పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి 1980లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
తరిగొండ వెంగమాంబ రచనలపై పరిశోధనలు చేసి రూపొందించిన పాటలను టీటీడీ ఆధ్వర్యంలో సీడీలుగా రికార్డు చేశారు. అలాగే పెదతిరుమలాచార్యుల రచనలు, గొల్లకలాపం వంటి అముద్రిత రచనలను సీడీలుగా రూపొందించి వెలుగులోకి తెచ్చారు. వాటిని పుస్తక రూపంలో కూడా తెచ్చారు.
గతంలో సినీ రంగానికి చెందిన వ్యక్తిని ఎస్వీబీసీ లాంటి ఆధ్మాతిక చానల్‌కు చైర్మన్‌గా నియమించడంతో చోటు చేసుకున్న దుష్ప్రరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు యాచేంద్రలాంటి గొప్ప కళారాధకుడిని నియమించడం సదా ప్రశంసలు అందుకుంటోంది.