దుబ్బాకలో సంచలనం విజయం సాధించిన రఘునందన్‌రావు దివంగత వైఎస్సార్‌పై నోరు పారేసుకున్నందుకు ఫలితం ఏంటో తెలిసి వచ్చినట్టుంది.
తమ ప్రియతమ నేత మరణాన్ని కించపరిచేలా మాట్లాడిన రఘునందన్ వీడియోను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ …రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా వైఎస్సార్ అభిమానాన్ని చూరగొన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయడంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందని కనిపెట్టిన రఘునందన్ … తాజాగా మీడియాతో మాట్లాడుతూ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాజా వీడియోలో వైఎస్సార్‌ను మహానాయకుడని కీర్తించడం గమనార్హం.
“నేను వైఎస్సార్ గారిని తప్పుగా, కించపరిచేట్టు మాట్లాడలేదు. నిన్న ప్రెస్‌మీట్ సందర్భంగా కేసీఆర్ గతంలో రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ …మీకు కూడా భవిష్యత్‌లో ఇట్లాంటిది రాకూడదని చెప్పాను.
అంతే తప్ప …నా ఉద్దేశం రాజశేఖరరెడ్డి గారిని కానీ, వారి కుటుంబాన్ని కానీ కించపరచడం కాదు. కాబట్టి రాజశేఖరరెడ్డి గారి అభిమానులందరికీ విజ్ఞప్తి ఏంటంటే… తప్పుగా ట్రోల్ చేయకండి. ఆ మహానాయకుడిని కించపరచలేదు.
వారి పథకాల గురించి నేను చాలా సార్లు మాట్లాడిన విషయాలు మీరు గుర్తు చేసుకోండి. అయినప్పటికి కూడా బాధపడుతున్న రాజశేఖరరెడ్డి అభిమానులందరికీ నేను పూర్తి స్థాయిలో నిన్నటి ప్రెస్‌మీట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాను” అని రఘునందన్ వివరణ ఇచ్చారు.
వైఎస్సార్ అభిమానులతో పాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రఘునందన్‌కు బీజేపీ పెద్దల నుంచి అక్షింతలు పడినట్టున్నాయి. అందులోనూ గ్రేటర్ ఎన్నికల ముంగిట సెటిలర్స్ ఆగ్రహానికి గురయ్యేలా రఘునందన్ వ్యాఖ్యలున్నాయని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్థులపై నోరు పారేసుకునే రఘునందన్, అలవాటులో భాగంగానే వైఎస్సార్‌పై కూడా అదే తీరు కనబరిచారంటున్నారు.
తాను సైన్స్ టీచర్‌నని, ప్రకృతిని నమ్ముతానని, యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందంటూ …రాజశేఖరరెడ్డి మరణాన్ని అవహేళన చేస్తూ రఘునందన్ మాట్లాడ్డం వాస్తవం.
రఘునందన్ నోటి దురుసుతో బీజేపీకి హైదరాబాద్‌లో డ్యామేజీ జరిగిపోయింది. నష్ట నివారణలో భాగంగా రఘునందన్ తాజాగా వైఎస్సార్‌పై ప్రేమ కనబరుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.