బాబు అవమానిస్తే జగన్ అందలమెక్కించారు

పాదయాత్రలో జగన్ వెంట నడిచి, ఆయన మెప్పు పొందిన పృథ్వీ అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్ గా లైమ్ లైట్లోకి వచ్చారు. ఎంత సడన్ గా ఎంట్రీ ఇచ్చారో, అంతే సడన్ గా ఆయన వివాదాల్లో…

పాదయాత్రలో జగన్ వెంట నడిచి, ఆయన మెప్పు పొందిన పృథ్వీ అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్ గా లైమ్ లైట్లోకి వచ్చారు. ఎంత సడన్ గా ఎంట్రీ ఇచ్చారో, అంతే సడన్ గా ఆయన వివాదాల్లో చిక్కుకుని వెనక్కి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఎవరికిస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎవరికిచ్చినా కచ్చితంగా వారికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది అనుకున్నారంతా.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నటి, యాంకర్ స్వప్న పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వైసీపీకి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు నటులు, నిర్మాతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ జగన్ ఈసారి శ్రీవారి వ్యవహారాలకు సినిమా ఇండస్ట్రీకి లింకు పెట్టదలుచుకోలేదు. 

పూర్తిగా రాజకీయ మకిలిని కూడా అంటించలేదు. మధ్యే మార్గంగా సంగీత, సాహిత్యంలో ప్రవేశం ఉన్న వెంకటగిరి సంస్థానం వారసుడు.. సాయికృష్ణ యాచేంద్రను చైర్మన్ గా నియమించారు.

వెంకటగిరి రాజాలు ఆది నుంచీ టీడీపీతోనే ఉన్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి, ఇప్పటి చంద్రబాబు వరకు రాజాలు పార్టీ కోసం పనిచేశారే కానీ, జేబులు నింపుకొనే పని చేయలేదు. ఒక రకంగా పార్టీయే వారి ఇమేజ్ వాడుకుని ఓట్ల ద్వారా లబ్ధి పొందింది. చివరికి రెండు దఫాలుగా రాజాలకు టికెట్ కూడా నిరాకరించి అవమానించారు చంద్రబాబు.

గతేడాది జరిగిన ఎన్నికల్లో వెంకటగిరిలో రాజాలు వైసీపీకి మద్దతు తెలిపారు. రామనారాయణ రెడ్డి గెలుపుకోసం కృషిచేశారు. రాజకీయాల్లో ఉన్నా వివాదాలకు దూరంగా ఉండే సాయికృష్ణ యాచేంద్రకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ మరింత గౌరవాన్నిచ్చారు.

గేయధార సృష్టికర్తగా, అన్నమయ్య రచనలను వెలుగులోకి తెస్తున్న సాహిత్య ప్రియుడిగా సాయికృష్ణకు పేరుంది. ఓ దఫా ఎమ్మెల్యేగా కూడా ఈయన పనిచేశారు.అయితే రాష్ట్రంలో మిగతా రాజవంశీకుల్లాగా ఎప్పుడూ వెంకటగిరి రాజాలు ప్రచారం, పేరు కోరుకోలేదు.

తమ హయాం అంతా టీడీపీకి అనుకూలంగా ఉన్నా కూడా.. గత ఎన్నికల్లో తనతో కలసి నడిచినందుకు వెంకటగిరి రాజాలకు మంచి బహుమానం అందించారు సీఎం జగన్. చంద్రబాబు అవమానిస్తే, జగన్ అందలమెక్కించారు.

అసలే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తోంది