దిక్కున్న చోట చెప్పుకోమ‌న్నారు…

క‌డ‌ప జిల్లాలో ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన పొలం వివాదం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. అక్బ‌ర్ బాషా హెచ్చ‌రించిన‌ట్టుగానే భార్యా, ఇద్ద‌రు కూతుళ్ల‌తో స‌హా సోమ‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అయితే బంధువులు వెంట‌నే…

క‌డ‌ప జిల్లాలో ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన పొలం వివాదం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. అక్బ‌ర్ బాషా హెచ్చ‌రించిన‌ట్టుగానే భార్యా, ఇద్ద‌రు కూతుళ్ల‌తో స‌హా సోమ‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అయితే బంధువులు వెంట‌నే గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింద‌ని స‌మాచారం. ఆస్ప‌త్రిలో అక్బ‌ర్‌బాషా మాట్లాడుతూ సీఎం స‌మీప బంధువు  తిరుపాల్‌ రెడ్డి, మేయ‌ర్ సురేష్ బాబు త‌నతో దురుసుగా మాట్లాడార‌ని వాపోయాడు.

క‌డ‌ప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో క‌ర్నూలు జిల్లా చాగ‌ల‌మ‌ర్రికి చెందిన అక్బర్ బాషాకు భార్య త‌ర‌పున 1.50 ఎక‌రాల భూమి సంక్ర‌మించింది. గిప్ట్ డీడ్‌గా ఇచ్చిన ఆ భూమిని తిరిగి ఆయ‌న స‌మీప బంధువు కాశీంబీ వెన‌క్కి తీసుకుంది. త‌న బాగోగులు చూసుకోక‌పోవ‌డంతో భూమిని వెన‌క్కి తీసుకున్న‌ట్టు కాశీంబీ వాదిస్తున్నారు. 

ఈ భూమిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీప బంధువు తిరుపేల్‌రెడ్డి కుమారుడికి అమ్మారు. అనంత‌రం ఆయ‌న మ‌రొక‌రికి అమ్మారు. కానీ త‌న‌కు గిప్ట్‌గా ఇచ్చిన భూమిని వెన‌క్కి తీసుకోవ‌డంతో పాటు ఇత‌రుల‌కు విక్ర‌యించ‌డాన్ని అక్బ‌ర్‌బాషా కుటుంబం అంగీక‌రించ‌డం లేదు. దీనిపై  ద‌శాబ్ద కాలానికి పైబ‌డి వివాదం న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 11న అక్బ‌ర్‌బాషా ఫేస్‌బుక్ లైవ్‌లో త‌న‌కు 48 గంటల్లో న్యాయం చేయ‌క‌పోతే భార్యా, ఇద్ద‌రు కూతుళ్ల‌తో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డం, వెంట‌నే సీఎం జ‌గ‌న్ స్పందించిన సంగ‌తులు తెలిసిన‌వే. అనంత‌రం అక్బ‌ర్‌బాషాతో పాటు కుటుంబ స‌భ్యుల్ని క‌డ‌ప‌కు పిలిపించి మాట్లాడారు. 

త‌న‌కు ముఖ్య‌మంత్రి న్యాయం చేశార‌ని, ఆయ‌న దేవుడ‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇదంతా క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు స‌మ‌క్షంలో చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అక్బ‌ర్‌బాషా త‌మ కార్య‌క‌ర్త అని సురేష్‌బాబు తెలిపారు కూడా.

అయితే ఈ వారంలో ఏం జ‌రిగిందో గానీ, నిన్న రాత్రి 10 గంట‌ల‌కు ఆయ‌న త‌న భార్య ఖాసీంబీ, కుమార్తెలు ఆసిఫా, ఆసీన్‌ల‌తో క‌లిసి పురుగుల మందు తాగారు. బంధువులు గుర్తించి వెంట‌నే చాగ‌ల‌మ‌ర్రిలోని కేర‌ళ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ప్రాణాపాయం లేద‌ని వైద్యులు, పోలీసులు తెలిపారు.

ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ అక్బర్‌బాషా మాట్లాడుతూ త‌న‌ భూమి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా కొందరు అడ్డుపడుతున్నార‌ని వాపోయాడు. దిక్కున్న చోట చెప్పుకోండని దువ్వూరుకు చెందిన తిరుపాల్‌ రెడ్డి, క‌డ‌ప మేయర్‌ సురేష్ బాబు హెచ్చరించార‌ని ఆరోపించాడు. ఈ విష‌యమై క‌డ‌ప ఎస్పీ అన్బురాజ‌న్ స్పందించారు. 

ఎర్రబల్లిలోని 1.50 ఎకరాల భూమి అక్బర్‌ బాషాది కాద‌ని తేల్చి చెప్పారు. అతని అత్త కాశీంబీదని మైదుకూరు కోర్టు 2018లో తీర్పు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ హైకోర్టుకు వెళ్లలేదని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.