తిరుమల…హిందువుల అతిపెద్ద , గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడు కొండలెక్కి తిరుమలలో కాలు మోపిన భక్తులకు ఓంకార నాథం చెవులకే కాదు…మనసుకు ఇంపుగా ఉంటుంది. భక్తి పారవశ్యంలో తేలియాడుతూ ఆ ఓంకార నాథాన్ని ఆస్వాదిస్తున్నంత సేపు స్వర్గలోకంలో నడియాడుతున్న భావన కలుగుతుంది.
తిరుమల దర్శనం అంటే మామూలు విషయం కాదు. స్వామి దర్శనానికి ఉన్న డిమాండ్ మాటల్లో చెప్పలేంది. ఏడు కొండల స్వామిని దర్శించుకుని, తమ ఆవేదనను విన్నవించుకుంటే ఓ పరిష్కారం దొరుకుతుందని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. స్వామి దర్శనానికి కొన్ని నెలల ముందే ప్రణాళిక రచించుకోవాల్సిందే. ఇది కరోనాకు ముందు పరిస్థితి.
కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాక్ష్యాత్తు టీటీడీ ఈవో అశోక్‌సింఘాల్ మాటల్లోనే తెలుసుకుందాం.
జూన్ 11 నుంచి తిరుమల దర్శనానికి అనుమతించాం. ఆ రోజు నుంచి జూలై 10వ తేదీ వరకు తిరుమల దర్శనాలను సమీక్షిస్తే… 2,02,346 మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. వీరిలో 55,669 మంది దర్శనానికి రాలేదు. అంటే 25-30 శాతం మంది భక్తులు గైర్హాజరయ్యారు’
దీన్ని స్వామి వారి దర్శనం కంటే తమ ప్రాణాలే ముఖ్యమని భక్తులు భావిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఎప్పుడైనా తిరుమల విషయంలో ఉండేదా? మరెందుకు ఇప్పుడే ఇలా? అంటే కరోనా మహమ్మారి ఎంతగా భయపెడుతోందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో వెలవెలబోయింది. ఏ హిందువూ తిరుమలలో ఇలాంటి పరి స్థితిని కలలో కూడా ఊహించి ఉండడు. ప్రస్తుతం అన్‌లాక్ తర్వాత తిరుమల, తిరుపతిలో నెలకున్న పరిస్థితులపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కరోనా మహమ్మారి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరిని కబళిస్తుందోననే భయం నిలువునా కంపించేలా చేస్తోంది.
కానీ టీటీడీ అధికారుల వాదన ప్రజలు, భక్తుల మనోభావాలకు విరుద్దంగా ఉంది. తిరుమలకు దర్శనాల కోసం వచ్చి వెళు తున్న భక్తుల్లో ఏ ఒక్కరూ కరోనా బారిన పడలేదని టీటీడీ అధికారుల వాదన. కానీ దాన్ని వాళ్లెలా చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, భక్తులు, ప్రజల వాదన ఎలా ఉన్నా…వాస్తవాలేంటో తెలుసుకొందాం.
తిరుమలకు సంబంధించి 11 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. అలాగే వంద మంది టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఇంకా కొన్ని వైద్య పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక్కడ టీటీడీ ఉన్నతాధికారులు ప్రధానమైన అంశాన్ని విస్మరిస్తున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులు కరోనా బారిన పడలేదని అనుకున్నాం. దేవుని దయ వల్ల అంతా మంచే జరుగుతున్నదని సంతోషిద్దాం. మరి రోజురోజుకూ అర్చకులు, టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడుతుండడంపై టీటీడీ ఉన్నతాధికారులు ఏం చెబుతారు? ప‌్రతిరోజూ ముగ్గురు నలుగురు అర్చకులు కరోనా బారిన పడుతున్నట్టు అధికారికంగానే వార్తలు వస్తున్నాయి. అందులోనూ తిరుమలలో 50 ఏళ్లకు పైబడిన అర్చుకులే ఎక్కువ.
ఇదే పోలీస్‌శాఖ విషయానికి వస్తే 50 ఏళ్లకు పైబడిన వారికి తిరుమలలో బాధ్యతలు అప్పగించొద్దని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. మరి పోలీస్‌శాఖ ఏమైనా అజ్ఞానంతో ఈ నిర్ణయం తీసుకుందా? ఇదే పాలసీని టీటీడీ ఉద్యోగుల విషయంలో ఎందుకు అమలు చేయడం లేదు? తిరుమలలో గ్రహపాటుగానో, పొరపాటుగానో మరికొందరు అర్చకులు కరోనాబారిన పడితే…రానున్న ఉపద్రవం గురించి టీటీడీ ఉన్నతాధికారులు ఒక్క క్షణమైనా ఆలోచించారా? అర్చకులు లేకుండా కైంకర్యాలు నిర్వహిస్తారా? అంటే మొదటికే మోసం రాదా?
అర్చకులు లేకుండా, స్వామి వారికి కైంకర్య సేవలు లేకుండా తిరుమల శ్రీవారిని ఊహించుకోవడం సాధ్యమా? కీడెంచి మేలు ఎంచాలని పెద్దలు చెబుతారు. ఈ విషయమై టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు ఒక్క క్షణమైనా లోతుగా ఆలోచించారా? ఒకవేళ ఆ దిశగా ఆలోచన చేసి వుంటే….పరిస్థితి అదుపు తప్పే వరకు కళ్లు మూసుకుని కాలక్షేపం చేస్తూనే ఉంటారా?
ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారులు తిరుమల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం…ఆకులు కాలాక చేతులు పట్టుకున్న మాదిరవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.