నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతి అధ్యాత్మిక క్షేత్రం …ఇవాళ జై రాయలసీమ, ఒక రాజధాని వద్దు-మూడు రాజధానులే ముద్దు నినాదాలతో హోరెత్తింది. రాయలసీమ ద్రోహులను తరిమికొడతాం అంటూ విద్యార్థి, ఉద్యోగ, మేధావుల ప్రతినిధులు హెచ్చరించారు.
అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగించాలంటూ ఆ ప్రాంత పరిరక్షణ సమితి నేతృత్వంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో 44 రోజుల పాటు చేపట్టిన పాదయాత్ర ముగిసింది. పేరుకు అమరావతి పరిరక్షణ సమితే అయినప్పటికీ, అంతా తానై టీడీపీ నడిపించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో శుక్రవారం బహిరంగ సభ తలపెట్టారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ మేధావుల ఫోరం నేతృత్వంలో గురువారం విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి కృష్ణాపురం ఠాణా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకూ రాయలసీమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో భారీ ర్యాలీగా వెళ్లారు.
ర్యాలీలో చేసిన నినాదాలతో తిరుపతి నగరం మార్మోగింది. సీమ గుండె చప్పుడును ర్యాలీ వినిపించారు. సీమ ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ అడుగడుగునా హెచ్చరించారు. అమరావతి మద్దతుదారుల గుండెలదిరేలా సీమ గుండె చప్పుడు తిరుపతి వేదికగా మార్మోగింది.