ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని ఏం చేయాలనుకుంటున్నారని ఆ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ అధికారులతో పాటు పాలక మండలి నిర్లక్ష్యాన్ని, లెక్కలేని తనంపై తిరుపతి, తిరుమల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తూ ఆ ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు ఆలయ అర్చకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు , ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని ఈఓ ప్రకటించారు.
మరి తిరుమలలో పదుల సంఖ్యలో పురోహితులు కరోనాబారిన పడ్డారు. అలాగే 90 మంది టీటీడీ ఉద్యోగులు కరోనాబారిన పడినప్పటికీ టీటీడీ ఈఓ, అదనపు ఈఓ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంపై ముఖ్యంగా తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేనంతగా 24 మంది టీటీడీ బోర్డు సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. విపత్కర సమయంలో సరైన నిర్ణయం తీసుకోడానికి ఇంకెంత మంది కావాలని తిరుపతి వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఒక తిరుపతి నగర పరిధిలోనే 1100 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తమ నగరాన్ని చైనాలోని ఊహాన్‌గా తయారు చేయాలనుకుంటున్నారా అని నిలదీస్తున్నారు. నగరవాసులు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తుతున్నారు. దీన్నిబట్టి తిరుపతిలో జీవనం సాగిస్తున్న వాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు, ఇతరత్రా స్థానికేతరుల వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా విజృంభిస్తున్నా తిరుమల దర్శనాలపై అధికారులు, పాలక మండలి ఎందుకంత పట్టింపులకు పోతున్నదో అర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం తెలిస్తే సీఎం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల దర్శనానికి అనుమతించే వారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శనాలకు సంబంధించి కొందరు తమ మెహర్బానీ కోసం సీఎంను కూడా తప్పుదోవ పట్టించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శ్రీశైలంలో కేవలం ఇద్దరు ఆలయ అర్చకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడడంతో అక్కడి ఆలయ ఈవో ఏకంగా వారం పాటు దర్శనాల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంటే…ఇక్కడి ఈవో, అదనపు ఈవో ఏం చేస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని నిలదీస్తున్నారు. మరోవైపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తుండడంపై సొంత పార్టీ శ్రేణుల నుంచే నిరసన వ్యక్తమవుతోంది.
తిరుమలలో కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ జోన్‌గా కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి కొన్ని గంటల్లోనే ఆ ప్రకటనను ఉపసంహరించుకునేలా చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు తిరుపతిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరం అంతా లాక్‌డౌన్ ప్రకటించకపోవడంపై నగర వాసులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే తిరుమల దర్శనాలు అంత ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు.
లాక్ డౌన్‌లో దాదాపు 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన తెలిసిందే. జూన్ 11 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభించారు. మొదట కొన్ని రోజులు రోజుకు ఆరు వేల మందిని అనుమతించారు. అనంతరం 12 వేలకు పెంచారు. ప్రధానంగా తిరుపతి సమీపంలో తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. అలాగే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ, కర్నాటకలను హైరిస్క్ స్టేట్‌లుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, పొరుగునే ఉన్న తమిళనాడును విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తిరుచానూరులో లాక్ డౌన్ ప్రకటించాలని స్థానికుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ తిరుచానూరు అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపి వేయడానికి టీటీడీ అధికారులు ససేమిరా అంటుండంతో స్థానిక ప్రజాప్రతినిధులు డోలాయమానంలో పడ్డారని సమాచారం.
తిరుపతిలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండడంతో లాక్‌డౌన్ విధించాలని నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అంతేకాదు విధులు నిర్వహించడానికి టీటీడీ ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. లక్షలాది మంది మానసికంగా కుంగిపోతున్నా టీటీడీ ఉన్నతాధికారులకు, పాలక మండలికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌లో ఏ విధంగా పూజలు నిర్వహించారో ఇప్పుడు కూడా అట్లే కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల దర్శనాల విషయంలో కీలక పాత్ర పోషించాలని నగర వాసులు కోరుతున్నారు. ఎందుకంటే కరుణాకర్‌రెడ్డి కేవలం స్థానిక ఎమ్మెల్యే మాత్రమే కాదు, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు కూడా. పైగా టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి టీటీడీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మంచి పేరు ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన దేవుడి అవతారం ఎత్తితే ప్రజలు నష్టపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపత్కర సమయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ఆయనకు కొత్తకాదు. ఇప్పుడు మునుపటి కరుణాకర్‌రెడ్డిని చూడాలని నగర వాసులు కాంక్షిస్తున్నారు. ఆ దిశగా ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా పాలక మండలిపై ఒత్తిడి తేవాల్సి ఉంది.